Ambedkar: హైదరాబాదులోని అంబేద్కర్ స్మృతివనంలోకి వచ్చే నెల నుంచి పర్యాటకులకు అనుమతి

  • తుది దశలో హాలు నిర్మాణ పనులు
  • రోజూ అంబేద్కర్ జీవిత విశేషాలు, అరుదైన ఫొటోల ప్రదర్శన
  • ఎన్టీఆర్ మార్గ్ లో పదకొండు ఎకరాల్లో స్మృతివనం ఏర్పాటు
Arrangements are being made to allow tourists in the Ambedkar Memorial During May month

హైదరాబాద్ లోని డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ స్మృతివనాన్ని పూర్తిస్థాయిలో ప్రారంభించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. మరో నెల రోజుల్లో స్మృతి వనంలోకి పర్యాటకులను అనుమతించాలని భావిస్తోంది. ఇక్కడ ఏర్పాటు చేసిన 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం కింద 50 అడుగుల పీఠం ఉంది. దీని లోపలి భాగంలో 30 అడుగుల థియేటర్ ను నిర్మించారు. ఇందులో అంబేద్కర్ జీవిత విశేషాలకు సంబంధించిన వీడియోలను ప్రదర్శింస్తారు. ఈ హాలులో వంద మంది కూర్చుని చూసేలా ఏర్పాట్లు చేశామని అధికారులు చెప్పారు. 

అంబేద్కర్ స్మృతివనంలో ఏర్పాటు చేసిన మరో హాలులో ఫొటో ప్రదర్శన ఉంటుంది. బాల్యంతో పాటు ఆయన వివిధ బాధ్యతల్లో ఉన్నప్పటి అరుదైన ఫొటోలను ఇందులో ప్రదర్శిస్తారు. కాగా, పీఠం కింది భాగంలోని హాలు నిర్మాణ పనులు మరో 20 రోజుల్లోగా పూర్తవుతాయని అధికారులు చెప్పారు. అంబేద్కర్ స్మృతివనం దాదాపు 11 ఎకరాల్లో నిర్మించారు. ఇందులో మూడు ఎకరాలు పార్కింగ్ కోసం కేటాయించారు.

మిగతా ఏరియాలో పనులు కొనసాగుతున్నాయని, వీలైనంత తొందరగా పనులను పూర్తిచేసి నెల రోజుల తర్వాత పర్యాటకులను అనుమతించాలని అధికారులు భావిస్తున్నారు. స్మృతివనంలోకి పర్యాటకులను ఉచితంగా అనుమతించాలా.. లేక టికెట్ పెట్టాలా అనే విషయంపై చర్చలు జరుగుతున్నాయని అధికారులు తెలిపారు.

More Telugu News