Drinking: ప్లెయిన్ వాటర్ తాగడం మంచిది కాదా..?

Expert Says Drinking Plain Water Is Not The Best Way To Hydrate
  • శరీరంలో తగినంత నీటి నిల్వ కోసం ఎలక్ట్రోలైట్స్ అవసరం
  • కేవలం నీరు తాగడం వల్ల ఎలక్ట్రోలైట్స్ భర్తీ కావు
  • సముద్రపు ఉప్పు, పుచ్చకాయ రసం, కొబ్బరి నీరు మంచి ఆప్షన్లు
  • ఆరోగ్య నిపుణుడు కోరీ రోడ్రిగ్జ్ వివరణ 
శరీరంలో తగినంత నీటి పరిమాణం ఉన్నప్పుడే జీవక్రియలు సాఫీగా సాగుతాయి. ఆరోగ్యంగా ఉంటాం. కావాల్సినంత నీటిని తీసుకోవడం వల్ల శరీరం తాజాగా ఉండడమే కాదు, బరువు కూడా తగ్గొచ్చు. చర్మం, వెంట్రుకలు సైతం ఆరోగ్యంగా ఉంటాయి. నీరు ప్రాణాన్ని నిలబెడుతుంది. శక్తిని కూడా ఇస్తుంది. మరి అలాంటి నీటిని వేసవిలో సాధారణ రూపంలో తీసుకుంటే పెద్దగా ప్రయోజనం ఉండదంటున్నారు వెల్ నెస్ నిపుణుడైన కోరీ రోడ్రిగ్జ్. 

ప్లెయిన్ వాటర్ తీసుకోవడం వల్ల మనకు పెద్దగా ప్రయోజనం ఉండదంటూ ఆయన ఇన్ స్టా గ్రామ్ వేదికగా ఓ పోస్ట్ కూడా పెట్టారు. నీరు ఎక్కువగా తాగడం వల్ల మూత్ర విసర్జన రూపంలో ఎలక్ట్రోలైట్స్ ను కోల్పోతామంటూ.. తిరిగి మళ్లీ అదే నీటిని తీసుకోవడం వల్ల కోల్పోయిన ఎలక్ట్రోలైట్స్ భర్తీ కావని ఆయన చెబుతున్నారు. నీటికి ఎలక్ట్రోలైట్స్ ను యాడ్ చేసి తాగడం వల్ల, తాను చెప్పుకోతగ్గ వ్యత్యాసాన్ని గుర్తించానన్నారు.

నీటికి ఎలక్ట్రోలైట్స్ ను కలుపుకోవాలన్నది ఆయన సూచన. నీటిని ఎక్కువగా తీసుకోవడం వల్ల మూత్రం ద్వారా సోడియం, మెగ్నీషియం, పొటాషియం అనే ఎలక్ట్రోలైట్స్ ను నష్టపోతుంటామని తెలిపారు. మూత్ర విసర్జన ఎంత ఎక్కువగా చేస్తే తిరిగి అంత ఎక్కువగా ఎలక్ట్రోలైట్స్ ను భర్తీ చేసుకోవాల్సిన అవసరం ఏర్పడుతుందంటున్నారు.

నీటికి ఎలక్ట్రోలైట్స్ ను జోడించుకునేందుకు గాను సముద్రపు ఉప్పును కలుపుకోవాలని సూచిస్తున్నారు. అలాగే అల్లాన్ని, పుచ్చకాయ రసాన్ని కలుపుకుని తాగాలని చెబుతున్నారు. కొబ్బరి నీరు కూడా చేర్చుకోవాలని సూచించారు. కొబ్బరి నీరు ద్వారా ఎలక్ట్రోలైట్స్ భర్తీ అవుతాయని పేర్కొన్నారు. (కోరీ రోడ్రిగ్జ్ వీడియో కోసం)
Drinking
Plain Water
Hydrate
electrolytes
health
expert

More Telugu News