Doctor Preethi: డాక్టర్ ప్రీతి ఆత్మహత్య కేసు నిందితుడు సైఫ్‌కు ఊరట.. బెయిలు మంజూరు

  • డాక్టర్ ప్రీతి ఆత్మహత్య కేసులో డాక్టర్ సైఫ్‌పై ఆరోపణలు
  • అతడి వేధింపుల వల్లే ప్రీతి ఆత్మహత్య చేసుకుందన్న పోలీసులు
  • షరతులతో కూడిన బెయిలు మంజూరు చేసిన కోర్టు
  • 16 వారాలపాటు ప్రతి వారం విచారణ అధికారి ఎదుట హాజరు కావాలని ఆదేశం
Doctor Saif Who Accused in Doctor Preethi Case Got Bail

తెలంగాణ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన పీజీ మెడికల్ వైద్య విద్యార్థిని డాక్టర్ ప్రీతి ఆత్మహత్య కేసు నిందితుడు డాక్టర్ సైఫ్‌కు ఊరట లభించింది. ఈ కేసులో అరెస్టై రిమాండ్‌లో ఉన్న సైఫ్‌కు వరంగల్ జిల్లా ఎస్సీ, ఎస్టీ న్యాయస్థానం, వరంగల్ జిల్లా రెండో అదనపు జిల్లా కోర్టు బెయిలు మంజూరు చేసింది. 10 వేల పూచీకత్తుతోపాటు అంతే మొత్తానికి ఇద్దరి నుంచి పూచీకత్తును కోర్టుకు సమర్పించాలని బెయిలు ఉత్తర్వుల్లో కోర్టు పేర్కొంది.

అలాగే, ప్రతి శుక్రవారం మధ్యాహ్నం 12-2 గంటల మధ్య 16 వారాలపాటు కేసు విచారణ అధికారి వద్ద హాజరు కావాలని ఆదేశించింది. బాధిత కుటుంబ సభ్యులను బెదిరించే ప్రయత్నం చేయొద్దని పేర్కొంది. సైఫ్ కనుక నిబంధనలు ఉల్లంఘిస్తే బెయిలును రద్దు చేయాలని పోలీసులు కోర్టును కోరవచ్చని న్యాయమూర్తి వై.సత్యేంద్ర ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజీలో పీజీ అనస్తీషియా చదువుతున్న దరావత్ ప్రీతి ఈ ఏడాది ఫిబ్రవరి 22న తెల్లవారుజామున విధుల్లో ఉండగానే ఆత్మహత్యకు యత్నించింది. తొలుత వరంగల్ ఎంజీఎంలో చికిత్స అందించారు. ఆ తర్వాత హైదరాబాద్‌కు తరలించి చికిత్స అందించగా, పరిస్థితి విషమించడంతో ఆమె మృతి చెందింది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న డాక్టర్ సైఫ్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు రిమాండ్‌కు పంపారు. ఇప్పుడు అతడికి కోర్టు బెయిలు మంజూరు చేసింది.

More Telugu News