micronutrients: అందమైన కురులు, నిగారించే చర్మానికి మైక్రో న్యూట్రియంట్లు

  • విటమిన్ ఏ, సీ, డీ, బీ1, 5, 7 అవసరం
  • వెంట్రుకలు, గోళ్ల పెరుగుదలకు జింక్ కావాలి
  • మెగ్నీషియం, కాపర్, క్యాల్షియం, ఐరన్ తోనూ ప్రయోజనం 
From zinc to vitamin D Top essential micronutrients for healthy skin and hair

తమ శిరోజాలు అందంగా కనిపించాలని అందరూ కోరుకుంటారు. ఇందుకోసం ఖరీదైన ఉత్పత్తులు వినియోగించే వారితోపాటు, తమకు తోచిన ఉత్పత్తిని ట్రై చేసే వారు కూడా బోలెడు మంది ఉన్నారు. అయితే ఏది పడితే అది, ప్రకటనలలో చూసినవి కొనుగోలు చేసి ట్రై చేయడం వల్ల కొన్ని సందర్భాల్లో ప్రతికూల ఫలితాలు ఎదురుకావచ్చు. కనుక చర్మం, శిరోజాల సంరక్షణకు సహజ విధానాలనే అనుసరించాలి. లేదంటే ఉన్న ఆరోగ్యం కూడా నష్టపోవాల్సి వస్తుంది. 

ముఖ్యంగా చర్మం, వెంట్రుకల కోసం మైక్రో న్యూట్రియంట్లు (సూక్ష్మ పోషకాలు) చాలా అవసరమని నిపుణులు సూచిస్తున్నారు. చర్మం, వెంట్రుకలు ఆరోగ్యంగా, నిగారింపుతో ఉండేందుకు నాలుగు రకాల ఆహారం అవసరమని సూచిస్తున్నారు. అవి మినరల్స్, విటమిన్లు, అమైనో యాసిడ్లు, ఫ్యాటీ యాసిడ్లు. ఐరన్, మెగ్నీషియం, క్యాల్షియం, కాపర్, జింక్  తదితర మినరల్స్ ఆరోగ్యకరమైన చర్మానికి కావాలి. జింక్ అనేది చక్కని యాంటీ ఆక్సిడెంట్. ఇది మొటిమలను తగ్గిస్తుంది. గోళ్లు, వెంట్రుకల వృద్ధికి సాయపడుతుంది. కొల్లాజన్ పరిపక్వతకు కాపర్ తోడ్పడుతుంది. దీనివల్ల చర్మం సాగే గుణం మెరుగుపడుతుంది. ఐరన్ తగినంత లభించినప్పుడు అది వెంట్రుకల మొదళ్లు, స్కాల్ప్ వరకు ఆక్సిజన్, పోషకాలు చేరేలా చేస్తుంది. 

టారిన్, ఆర్జినిన్, లైసిన్, సిస్టీన్, మెథియోనైన్ అనే అమైనో యాసిడ్స్ గ్రోత్ ప్రొటీన్లను పెంచుతాయి. కెరటిన్ ను ఉత్పత్తి చేసే కెరటినోసైట్స్ కు తగినంత తేమను టారిన్ అందిస్తుంది. జుట్టు నెరవడం, కాలుష్య కారకాల ప్రభావాన్ని తగ్గిస్తుంది. ఇతర అమైనో యాసిడ్స్ కూడా వెంట్రుకల వృద్ధికి సాయపడతాయి. కనుక విటమిన్ ఏ, బీ1, బీ5, బీ7, విటమిన్ సీ, డీ తీసుకోవచ్చు. ఇవన్నీ చర్మం, జుట్టు ఆరోగ్యానికి మేలు చేస్తాయి. విటమిన్ డీ అనేది ఉదయం, సాయంత్రం సమయాల్లో సూర్యరశ్మికి అరగంట పాటు గురైతే వచ్చేస్తుంది. శిరోజాలు కళ కోల్పోతున్న వారు, చర్మం పాలిపోయినట్టున్నవారు వైద్యుల సూచన మేరకు అవసరమైన వాటిని తీసుకోవాలి.

More Telugu News