Sajjala Ramakrishna Reddy: నాడు వైఎస్ పై ఇదే ప్రయోగం చేశారు... ఇప్పుడు జగన్ పై..!: సజ్జల

  • వివేకా హత్య కేసు పరిణామాలపై సజ్జల ప్రెస్ మీట్
  • ఎల్లో మీడియా దుష్ప్రచారం చేస్తోందని విమర్శలు
  • దస్తగిరితో మాట్లాడిస్తోంది వీళ్లేనేమో అంటూ సందేహం
  • టీడీపీ దిగజారిపోయిందని వ్యాఖ్యలు
Sajjala Press Meet over Viveka issue

వివేకా హత్య కేసులో ఇటీవల పరిణామాలు, రాజకీయ ప్రకంపనలపై ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడారు. వివేకా హత్య వ్యవహారంలో ఎల్లో మీడియా దుష్ప్రచారం చేస్తోందని విమర్శించారు. కల్పిత అంశాలు, కట్టుకథలనే ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. వీళ్ల వరుస చూస్తుంటే వచ్చే ఎన్నికల్లో వివేకా హత్యకేసు అజెండాతో ప్రజల్లోకి వెళ్లేట్టు కనిపిస్తున్నారని వ్యాఖ్యానించారు. ఇప్పటికిప్పుడు చంద్రబాబును సీఎం కుర్చీలో కూర్చోబెట్టాలని ఎల్లో మీడియా తాపత్రపడుతోందని సజ్జల విమర్శించారు. 

దస్తగిరితో మాట్లాడిస్తోంది వీళ్లేనేమో అనిపిస్తోందని, అందుకే దస్తగిరి చెప్పిన మాటలనే పతాక శీర్షికలుగా పెడుతున్నారని వెల్లడించారు. "టీడీపీ ఎంత దిగజారిపోయిందో దీన్ని బట్టే అర్థమవుతోంది. టీడీపీకి ఇవాళ ప్రజలు లేరు... ప్రజలకు సంబంధించిన సమస్యలు లేవు... సీఎం జగన్ ను ఎదుర్కోవడానికి ఏం చేస్తారో చెప్పుకోవడానికి ఏమీ లేదు. 

కుటుంబంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి తర్వాత వివేకానందరెడ్డే పెద్ద దిక్కుగా ఉన్నారు. నాడు ఇంట్లో ఒత్తిడి వల్లో, మరే కారణం వల్లో కాంగ్రెస్ నుంచి బయటికి రాలేకపోయినా, తన తల్లిపై పోటీ చేసినా జగన్ సాదరంగా ఆయనను పార్టీలోకి ఆహ్వానించారు. వివేకానంద గారు కడప జిల్లాలో వైసీపీకి అన్నింటికి తానే ముందుండి, అవినాశ్ రెడ్డి, తదితర నేతలతో ముందుకు సాగారు. జగన్ కుటుంబంలో అయితే వివేకానే పెద్ద దిక్కు. అంతటి బాధాకరమైన సంఘటన జరిగితే, నిందితులు వీళ్లేనంటూ ఉద్దేశపూర్వకంగా ప్రచారం చేశారు. నాడు వైఎస్సార్ పై ఇదే ప్రయోగం చేశారు... ఇప్పుడు జగన్ పై దాడి చేస్తున్నారు" అని సజ్జల వ్యాఖ్యానించారు.

సజ్జల వ్యాఖ్యల ముఖ్యాంశాలు...

  • సీబీఐ... మూడక్షరాల ఈ పేరులోని ప్రతి అక్షరానికి విలువ ఉంటుంది.
  • కానీ వివేకా హత్య కేసులో దర్యాప్తే జరగడంలేదు. కావాల్సిన వారి దగ్గర స్టేట్ మెంట్లు తీసుకుంటున్నారు తప్ప దర్యాప్తు జరగడంలేదు.
  • ఇదంతా ఇన్వెస్టిగేషన్ పేరుతో జరుగుతున్న డ్రామా తతంగం.
  • వీళ్లందరూ కుమ్మక్కయి ఈ పరిస్థితిని తీసుకువచ్చారు.
  • ముందే నిర్ణయించుకున్న కోణంలో తప్ప, ఇటువైపు ఎందుకు చూడరు అని ప్రశ్నించినా పట్టించుకోకుండా, ఎంపీ అవినాశ్ రెడ్డి, ఆయన తండ్రినే కేసులో బుక్  చేయాలన్న కోణంలో వెళుతుంటే అన్యాయం జరుగుతుందని విజ్ఞప్తి చేస్తే, సుప్రీంకోర్టు సానుకూలంగా స్పందించి సీబీఐ విచారణ బృందాన్ని మార్చింది.
  • విచారణ టీమ్ నే మార్చారంటే ఏమిటి దానర్థం... ఈ వాదనలో, ఈ విజ్ఞప్తిలో కొంత సత్యం ఉందనే సుప్రీం కోర్టు ఈ నిర్ణయం తీసుకుంది.
  • కానీ కొత్త టీమ్ వచ్చిందన్న మాటే గానీ ఈ కేసులో ఒక కొత్త కోణాన్ని వెలికి తీయడం కానీ, ఒక కొత్త సాక్షిని విచారించడం కానీ జరగలేదు.
  • కేవలం రామ్ సింగ్ అనే అధికారి చేయాలనుకున్న పనిని వీళ్లు పూర్తి చేయడానికి వచ్చినట్టున్నారు. 
  • 30వ తేదీ లోగా కేసు క్లోజ్ చేయాలన్నారు కాబట్టే ఈ విధంగా వ్యవహరిస్తునారు.
  • అంతకుముందు నిందితుడు కాని భాస్కర్ రెడ్డికి నోటీసులు ఇచ్చి రిమాండ్ కు పంపగానే నిందితుడు అయిపోయాడు. అంతకుముందు లేని అవినాశ్ రెడ్డి సహనిందితుడు అయిపోయాడు.
  • ఇప్పుడు ప్రజలకు దీనిపై ఎందుకు వివరణ ఇస్తున్నామంటే... ఈ కేసు ఏ విధంగానూ నిలబడదు. భాస్కర్ రెడ్డి, అవినాశ్ రెడ్డి, శివశంకర్ రెడ్డిలపై కేసు నిలిచే అవకాశమే లేదు. ఎందుకంటే... ఈ వ్యవహారంలో వాళ్ల పాత్ర ఏమీ లేదు. వాళ్లు ఈ విషయంలో ధీమాగా ఉన్నారు. కోర్టు విచారణలో నిజమేమిటో తేలుతుంది.
  • కానీ మేం ఎందుకు బాధ పడుతున్నామంటే... కుటుంబంలోని వాళ్లపైనే ఆరోపణలు చేస్తున్నారు. ఈ లోపే ఎల్లో మీడియా వాళ్లు యధేచ్ఛగా విచారణ జరిపి, వాళ్లే దోషులను నిర్ధారించేస్తారు. ఈ విధంగానైనా జగన్ ను దెబ్బతీయాలని చూస్తారు. హూ కిల్డ్ బాబాయ్ అనేది కూడా ఇందులో ఒకటి. సైకో అనే ప్రచారం కూడా ఇందులో భాగమే. ఈ కేసును కూడా జగన్ ప్రతిష్ఠను దెబ్బతీయడానికి ఉపయోగించుకుంటున్నారు.
  • అప్రూవర్ గా ఎవరినైనా ఎప్పుడు మార్చుతారు... ఓ కేసు ఏమీ తేలనప్పుడు అప్రూవర్ గా మార్చుతారు. వాచ్ మన్ రంగన్న సాక్షిగా అన్ని విషయాలు చెప్పినప్పుడు అప్రూవర్ తో పనేంటి?

More Telugu News