Uttarakhand: ఉత్తరాఖండ్‌లో హడలెత్తిస్తున్న పులి.. 25 గ్రామాల్లో కర్ఫ్యూ!

Curfew in 25 Uttarakhand villages after tiger kills two in three days span
  • పౌరి జిల్లాలో ఘటన
  • మూడు రోజుల వ్యవధిలో ఇద్దరిని చంపేసి తిన్న పెద్ద పులి
  • నేటి వరకు పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలకు సెలవులు
  • పులిని ‘మ్యాన్ ఈటర్’గా ప్రకటించాలన్న ఎమ్మెల్యే
  • పులుల దాడిలో మరణిస్తే రూ. 4 లక్షల పరిహారం ఇస్తామన్న అటవీ అధికారులు

ఉత్తరాఖండ్‌లోని పౌరి జిల్లాలో అడవిని వీడి బయటకు వచ్చిన ఓ పెద్ద పులి 25 గ్రామాల ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తోంది. మూడు రోజుల వ్యవధిలో ఇద్దరిపై దాడిచేసి చంపేసింది. దీంతో ప్రజలు బయటకు రావాలంటేనే హడలిపోతున్నారు. రంగంలోకి దిగిన పోలీసులు 25 గ్రామాల్లో రాత్రి 7 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ విధించారు. నేటి వరకు పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలను మూసివేయాలని కలెక్టర్ ఆదేశించారు.

కార్బెట్ టైగర్ రిజర్వుకు సమీపంలోని సిమ్లీ గ్రామంలో ఒంటరిగా నివసిస్తున్న రణ్‌వీర్ సింగ్ నేగికి డెహ్రాడూన్‌లోని బంధువులు శనివారం నుంచి ఫోన్ చేస్తున్నా స్పందించడం లేదు. దీంతో గ్రామంలోని తెలిసిన వారికి ఫోన్ చేసి ఇంటికి వెళ్లి చూడాలని కోరారు. ఆదివారం వారు ఆయన ఇంటికి వెళ్తున్న దారిలో రక్తపు మరకలు కనిపించాయి. దీంతో వారు ఆయన కోసం గాలించగా ఇంటికి కొద్దిగా దూరంలో అతడి మృతదేహాన్ని గుర్తించారు. నేగిపై దాడిచేసిన పులి అతడిని చంపి సగం తిని వదిలేసి వెళ్లిపోయింది. గ్రామస్థులు ఈ విషయాన్ని వెంటనే అటవీ అధికారులకు తెలియజేశారు. మూడు రోజుల వ్యవధిలోనే ఇది రెండో ఘటన కావడంతో జనం వణికిపోతున్నారు. అంతకుముందు డల్లా గ్రామానికి చెందిన 70 ఏళ్ల వ్యక్తిని పులి చంపేసింది. 

పులిని పట్టుకునేందుకు రంగంలోకి దిగిన అటవీ అధికారులు గ్రామంలో బోను ఏర్పాటు చేశారు. పశువుల మేత కోసం గ్రామస్థులు అడవిలోకి వెళ్లొద్దని కోరారు. కాగా, ఈ పులిని మనుషుల్నివేటాడే జంతువుగా ప్రకటించాలని కోట్‌ద్వార్ ఎమ్మెల్యే దిలీప్ సింగ్ కున్వార్ ముఖ్యమంత్రి పుష్కర్‌సింగ్ ధామీని కోరారు. కాగా, పులుల దాడుల్లో మరణించిన వారి కుటుంబాలకు రూ. 4 లక్షల పరిహారం ఇవ్వనున్నట్టు అటవీ అధికారులు తెలిపారు.

  • Loading...

More Telugu News