CSK: అటు ధోనీ, ఇటు కోహ్లీ... ఐపీఎల్ లో ఆసక్తికర సమరం

  • ఐపీఎల్ లో ఇవాళ సీఎస్కే × ఆర్సీబీ
  • టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న బెంగళూరు
  • ఇరుజట్లలోనూ గమనించదగ్గ ఆటగాళ్లు
  • మ్యాచ్ హోరాహోరీగా సాగే అవకాశం
CSK takes in RCB in IPL

ఐపీఎల్ తాజా సీజన్ లో నేడు ఆసక్తికర సమరం జరగనుంది. చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్లు అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఈ పోరులో టాస్ గెలిచిన బెంగళూరు జట్టు బౌలింగ్ ఎంచుకుంది. ఐపీఎల్ లో కెప్టెన్ గా 200 మ్యాచ్ ల అనుభవం ఉన్న మహేంద్ర సింగ్ ధోనీ ఒకవైపు.... 6,838 పరుగులతో ఐపీఎల్ చరిత్రలోనే టాప్ స్కోరర్ గా ఉన్న విరాట్ కోహ్లీ మరోవైపు బరిలో దిగుతుండడంతో మ్యాచ్ పై సర్వత్రా ఆసక్తి వ్యక్తమవుతోంది. 

ఇరుజట్లలోనూ ప్రతిభావంతులైన ఆటగాళ్లు ఉండడంతో హోరాహోరీ పోరు తప్పదనిపిస్తోంది. చెన్నై సూపర్ కింగ్స్ ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ ఫామ్ లో ఉండగా, సీనియర్ ఆటగాడు అజింక్యా రహానే ముంబయి ఇండియన్స్ పై సంచలన ఇన్నింగ్స్ తో అందరి దృష్టిని తనవైపుకు తిప్పుకున్నాడు. రాయుడు, శివమ్ దూబే, జడేజా, ధోనీలతో సీఎస్కే బ్యాటింగ్ లైనప్ పటిష్టంగానే ఉంది. ఇక బౌలింగ్ విషయానికొస్తే... సిబందా మగాలా స్థానంలో పతిరణ జట్టులోకి వచ్చాడు. 

అటు, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుకు ఓపెనింగ్ జోడీయే సగం బలం. కోహ్లీ, కెప్టెన్ డుప్లెసిస్ జోడీ దాదాపు ప్రతి మ్యాచ్ లోనూ జట్టుకు శుభారంభం అందిస్తున్నారు. వీరిద్దరూ అవుటైతే గ్లెన్ మ్యాక్స్ వెల్ ఉండనే ఉన్నాడు. అయితే బెంగళూరు లైనప్ లో దినేశ్ కార్తీక్ విఫలమవుతుండడం ఆ జట్టు మేనేజ్ మెంట్ కు సమస్యగా మారింది. దాంతో మిడిలార్డర్ లో పరుగులు సాధించేవారు కరవయ్యారు. 

బౌలింగ్ లో మాత్రం సీఎస్కే కంటే బెంగళూరుకు మెరుగైన వనరులున్నాయి. సిరాజ్, వైశాక్ విజయ్ కుమార్, వేన్ పార్నెల్, వనిందు హసరంగలతో ఆర్సీబీ బౌలింగ్ విభాగం బలంగా కనిపిస్తోంది

More Telugu News