Ravindra Jadeja: చెన్నై సూపర్ కింగ్స్ యాజమాన్యంపై రవీంద్ర జడేజా వ్యాఖ్యలు

  • సీఎస్కే విజయయాత్రలో యాజమాన్యానిదే కీలకపాత్ర అన్న జడేజా
  • ఆటగాళ్లందరినీ సమానంగా చూస్తుందని వెల్లడి
  • ఫామ్ లో లేకపోయినా ఒకేలా గౌరవిస్తుందని స్పష్టీకరణ
  • జట్టులో పక్షపాత ధోరణి ఇంతవరకు చూడలేదని వ్యాఖ్యలు
Ravindra Jadeja comments on CSK owners

ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ నాలుగు టైటిళ్లు గెలిచిందంటే అందుకు కారణం యాజమాన్యమేనని ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా తెలిపాడు. ఆటగాళ్లకు మద్దతునివ్వడంలో సీఎస్కే ఫ్రాంచైజీ తర్వాతే ఎవరైనా అని వెల్లడించాడు. ఫామ్ లో లేక, వరుస వైఫల్యాలతో కష్టకాలం ఎదుర్కొంటున్న ఆటగాళ్లకు సీఎస్కే యాజమాన్యం అండగా నిలుస్తుందని వివరించాడు. అంతేకాదు, జట్టులోని ఆటగాళ్లందరినీ సమానంగా గౌరవిస్తుందని కొనియాడాడు. 

"సీఎస్కే మేనేజ్ మెంట్, ఓనర్ (ఎన్.శ్రీనివాసన్) ఏ ఆటగాడిపైనా, ఎప్పుడూ కూడా ఒత్తిడి పెంచలేదు. బరిలో దిగే 11 మంది ఆటగాళ్లపై వారి వైఖరి ఒకేలా ఉంటుంది. బాగా ఆడకపోయినా సరే ఎప్పుడూ విమర్శించరు. జట్టులో సీనియర్, జూనియర్ అనే తేడాల్లేవు. అండర్-19 క్రికెట్ నుంచి వచ్చిన యువ ఆటగాడు అయినా సరే... అతడ్ని కూడా జట్టులోని సీనియర్లతో సమానంగా చూస్తారు. బాగా ఆడిన ఆటగాడు... సరిగా ఆడని ఆటగాడు అనే తేడా ఉండదు. ఎవరి పట్ల ఏవిధమైన పక్షపాత ధోరణి ప్రదర్శించడాన్ని నేను చూడలేదు" అంటూ సీఎస్కే యాజమాన్యం వైఖరిని వివరించాడు. 

గతేడాది ఐపీఎల్ లో సగం మ్యాచ్ లకు రవీంద్ర జడేజా చెన్నై సూపర్ కింగ్స్ కు కెప్టెన్ గా వ్యవహరించడం తెలిసిందే. జడేజా కెప్టెన్సీలో వరుస ఓటములతో సీఎస్కే దారుణ ప్రదర్శన కనబర్చింది. దాంతో జడేజా కెప్టెన్సీ నుంచి తప్పుకోగా, ధోనీనే మళ్లీ పగ్గాలు అందుకోవాల్సి వచ్చింది. జడేజా గాయం పేరిట జట్టుకూ దూరమయ్యాడు. ఈ నేపథ్యంలో, జడేజాకు సీఎస్కే యాజమాన్యానికి మధ్య విభేదాలు నెలకొన్నాయని ప్రచారం జరిగింది.

More Telugu News