Perni Nani: అందుకే పవన్ తెలంగాణ మంత్రులపై ఈగ వాలనివ్వడంలేదు: పేర్ని నాని

 Perni Nani replies to Pawan Kalyan comments
  • తెలంగాణ ప్రజలకు వైసీపీ మంత్రులు క్షమాపణలు చెప్పాలన్న పవన్
  • ఏపీని అవమానిస్తే చూస్తూ ఉండాలా అన్న పేర్ని నాని
  • హరీశ్ రావు ఏం మాట్లాడారో పవన్ కు తెలియదా అంటూ ఆగ్రహం
  • పవన్ కు బీఆర్ఎస్ పై అంత ప్రేమ ఎందుకో అంటూ వ్యాఖ్యలు
తెలంగాణ ప్రజలకు వైసీపీ మంత్రులు క్షమాపణలు చెప్పాలంటూ జనసేనాని పవన్ కల్యాణ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తడం తెలిసిందే. దీనిపై వైసీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి పేర్ని నాని కౌంటర్ ఇచ్చారు. తెలంగాణ మంత్రి హరీశ్ రావు ఏం మాట్లాడారో పవన్ ఎందుకు చెప్పలేదని ప్రశ్నించారు. ఏపీని అవమానిస్తే చూస్తూ ఉండాలా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

ఏపీ మంత్రుల వ్యాఖ్యల్లో తెలంగాణ ప్రస్తావనే రాలేదని, పవన్ కల్యాణ్ మాత్రం ఏపీ మంత్రులపై నిందలు వేస్తున్నారని మండిపడ్డారు. పవన్ కు బీఆర్ఎస్ పై అంత ప్రేమ ఎందుకో? అని పేర్ని నాని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ గతంలో తెలంగాణపై ఏమేం వ్యాఖ్యలు చేశారో ఆ వీడియోను కూడా పేర్ని నాని మీడియాకు ప్రదర్శించారు. 

పవన్ కల్యాణ్ కు ఆంధ్రాపై ప్రేమ లేదా? ఈ రాష్ట్రం సొంతగడ్డ అనే భావన పవన్ కు లేదా? కన్నతల్లి వంటి రాష్ట్రాన్ని విమర్శిస్తే పవన్ కు బాధ లేదా? ఆంధ్రప్రదేశ్ నేలపై రాజకీయాల కోసమే ఉన్నారా? అని నిలదీశారు. పవన్ కల్యాణ్ వి కిరాయి మాటలు అని పేర్ని నాని కొట్టిపారేశారు. 

వ్యాపారాల కోసమే పవన్ తెలంగాణకు వత్తాసు పలుకుతున్నారని, అందుకే తెలంగాణ మంత్రులపై ఈగ వాలనివ్వడంలేదని ఆరోపించారు. తెలంగాణ వాళ్లకు లొంగిపోయావా? ఇది కొత్త బంధమా? పవన్ కొత్తగా వకీల్ పాత్రలు పోషిస్తున్నారా? అని ప్రశ్నించారు. వకాల్తాలు పుచ్చుకునే వట్టి వకీల్ పాత్రలు పవన్ కట్టిపెట్టాలని పేర్ని నాని హితవు పలికారు.
Perni Nani
Pawan Kalyan
YSRCP
Janasena
Andhra Pradesh
BRS
Telangana

More Telugu News