BCCI: రంజీ విజేతకు రూ.5 కోట్లు.. ప్రైజ్ మనీని భారీగా పెంచేసిన బీసీసీఐ

BCCI increases prize money for domestic tournaments Ranji Trophy winners to now get Rs 5 crore
  • అన్ని దేశవాళీ టోర్నమెంట్ ల ప్రైజ్ మనీ పెంచుతూ నిర్ణయం
  • ప్రకటించిన బీసీసీఐ కార్యదర్శి జైషా
  • దేశవాళీ క్రికెట్ పై పెట్టుబడులు పెంచుతామని ప్రకటన
దేశవాళీ ఆటగాళ్ల పంట పండింది. అన్ని దేశవాళీ టోర్నమెంటుల ప్రైజ్ మనీని బీసీసీఐ భారీగా పెంచేసింది. ప్రస్తుతం రంజీ ట్రోఫీ విజేతకు రూ.2 కోట్లు ప్రైజ్ మనీ వస్తుండగా, దీన్ని రూ.5 కోట్లు చేసింది. రన్నరప్ గా నిలిచిన జట్టుకు ఇకపై రూ.3 కోట్లు లభిస్తుంది. సెమీ ఫైనల్ లో ఓడిన జట్టుకు రూ.1 కోటి లభిస్తుంది. ఈ నిర్ణయాలను బీసీసీఐ కార్యదర్శి జైషా వెల్లడించారు.

బీసీసీఐ తరఫున నిర్వహించే అన్ని దేశీ టోర్నమెంటుల ప్రైజ్ మనీని పెంచినట్టు ట్విట్టర్ లో జైషా వెల్లడించారు. భారత క్రికెట్ కు వెన్నెముక అయిన దేశవాళీ క్రికెట్ పై పెట్టుబడులు కొనసాగిస్తామని ప్రకటించారు. ఇరానీ కప్ ప్రైజ్ మనీని సైతం రెట్టింపు చేసి రూ.50 లక్షలు చేశారు. ప్రస్తుతం రన్నరప్ కు ఎలాంటి ప్రైజ్ మనీ ఇవ్వడం లేదు. ఇక మీదట రూ.25 లక్షలు ఇస్తారు. 

దులీప్ ట్రోఫీ, విజయ్ హజారే ట్రోఫీ విజేతలకు రూ.కోటి చొప్పున ఇస్తారు. రన్నరప్ కు రూ.50 లక్షలు లభిస్తాయి. దియోదర్ ట్రోఫీ విజేతకు రూ.40 లక్షలు, ఫైనల్ లో ఓడిన జట్టుకు రూ.20 లక్షలు లభిస్తాయి. సయ్యద్ ముస్తక్ అలీ ట్రోఫీ విజేతకు రూ.80 లక్షలు, ఓడిన జట్టుకు రూ.40 లక్షలు లభిస్తాయి. 

మహిళా క్రికెటర్ల ప్రోత్సాహకాలనూ పెంచారు. సీనియర్ వుమెన్స్ వన్డే ట్రోఫీ కింద విజేతకి రూ.50 లక్షలు ఇస్తారు. రన్నరప్ కు రూ.25 లక్షలు లభిస్తాయి. సీనియర్ వుమెన్స్ టీ20 ట్రోఫీ విజేతకు రూ.40 లక్షలు ఇస్తారు. ప్రస్తుతం వస్తున్న దాని కంటే ఇది ఎనిమిది రెట్లు ఎక్కువ. ఓడిన జట్టుకి రూ.20 లక్షలు లభిస్తాయి.
BCCI
increases
prize money
domestic tournaments
Ranji Trophy

More Telugu News