IPL: గెలిచిన సూర్యకుమార్.. ఓడిన నితీష్ రాణా ఇద్దరికీ జరిమానా

  • వాంఖడేలో కేకేఆర్ జట్టుపై 5 వికెట్ల తేడాతో గెలిచిన ముంబై
  • రోహిత్ అనారోగ్యం వల్ల ముంబైకి కెప్టెన్ గా వ్యవహరించిన సూర్య
  • స్లో ఓవర్ రేట్ కారణంగా రూ. 12 లక్షల జరిమానా విధించిన రిఫరీ
  • ప్రత్యర్థి బౌలర్ తో గొడవకు దిగిన రాణా మ్యాచ్ ఫీజులో 25 శాతం కోత
surya kumar yadav and Nitish rana fined over slow over rate and  code of conduct breach

రోహిత్ శర్మ అనారోగ్యం కారణంగా ఆదివారం సాయంత్రం వాంఖడే స్టేడియంలో కోల్ కతా నైట్ రైడర్స్ తో జరిగిన మ్యాచ్ కు సూర్యకుమార్ యాదవ్ ముంబై ఇండియన్స్ జట్టుకు సారథ్యం వహించాడు. ఐపీఎల్ లో కెప్టెన్ గా తన తొలి మ్యాచ్ లో జట్టుకు ఘన విజయం అందించాడు. కానీ, తొలి పోరులోనే అతను జరిమానా ఎదుర్కొన్నాడు. అతనితో పాటు కేకేఆర్ కెప్టెన్ నితీష్ రాణాపై కూడా జరిమానా పడింది. స్లో-ఓవర్ రేట్ కారణంగా సూర్యకు మ్యాచ్ రిఫరీ రూ.12 లక్షలు జరిమానా వేశాడు. నిర్ణీత సమయంలో 20 ఓవర్లను పూర్తి చేయకపోవడంతో అతనిపై చర్యలు తీసుకున్నాడు. 

మరోవైపు ముంబై బౌలర్ హృతిక్ షోకీన్‌ వేసిన తొమ్మిదో ఓవర్ తొలి బంతికి క్యాచ్ ఇచ్చి నితీష్ రాణా అవుటయ్యాడు. ఆ సమయంలో సంబరాలు చేసుకుంటున్న షోకీన్‌పై రాణా అనుచిత వ్యాఖ్యలు చేశాడు. షోకీన్ కూడా బదులివ్వడంతో అతనిపైకి దూసుకెళ్లాడు. సూర్యకుమార్, పీయూష్ చావ్లా వచ్చి ఈ ఇద్దరినీ విడదీశారు. ఢిల్లీ రంజీ జట్టుకు ఆడుతున్న రాణా, షోకీన్ కు ముందు నుంచి పడదు. అయితే, రాణా, షోకీన్ క్రమశిక్షణ ఉల్లఘించినట్టు మ్యాచ్ రిఫరీ నిర్ధారించాడు. ఐపీఎల్ కోడ్ ఆఫ్ కండక్ట్ లెవల్ 1 నేరానికి పాల్పడినట్టు తేల్చి రాణా మ్యాచ్ ఫీజులో 25 శాతం కోత విధించాడు. షోకీన్‌కు మ్యాచ్ ఫీజులో 10 శాతం కోత పెట్టాడు.

కాగా, ఈ మ్యాచ్ లో ముంబై ఐదు వికెట్ల తేడాతో కేకేఆర్ ను ఓడించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన కోల్‌కతా నిర్ణీత 20 ఓవర్లలో 185 పరుగులు చేసింది. వెంకటేష్ అయ్యర్ సెంచరీ చేశాడు. అనంతరం ఇషాన్ కిషన్, సూర్య కుమార్ యాదవ్ మెరుపులు మెరిపించడంతో ముంబై 17.4 ఓవర్లలోనే లక్ష్యాన్ని అందుకుంది.

More Telugu News