Supreme Court: 2017 నుంచి యూపీలో 183 ఎన్‌కౌంటర్లు.. విచారణ కోరుతూ సుప్రీంకోర్టులో పిల్

PIL filed in Supreme court over encounters in UP
  • యోగి ముఖ్యమంత్రి అయిన తర్వాత యూపీలో కొనసాగుతున్న రౌడీల ఏరివేత
  • తాజాగా గ్యాంగ్ స్టర్ అతీక్ హత్యతో యూపీలో ఉద్రిక్త పరిస్థితులు
  •  ఎన్ కౌంటర్లపై స్వతంత్ర దర్యాప్తు కోరుతూ సుప్రీంను ఆశ్రయించిన న్యాయవాది విశాల్ తివారీ

ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలోని బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలో గూండాలు, రౌడీల ఏరివేత కొనసాగుతోంది. సంఘ విద్రోహశక్తులపై యోగి సర్కారు ఉక్కుపాదం మోపుతోంది. ఈ నేపథ్యంలో పోలీసుల ఎన్ కౌంటర్లలో పదుల సంఖ్యలో రౌడీ షీటర్లు హతం అయ్యారు. తాజాగా బడా గ్యాంగ్ స్టర్, రాజకీయ నేత అతీక్ అహ్మద్ కుమారుడైన అసద్‌ కూడా హత్యకు గురయ్యాడు. కొన్ని రోజుల క్రితం అతీక్, అతని సోదరుడు అష్రఫ్ లను పోలీసులు, మీడియా ప్రతినిధులు చూస్తుండగానే ముగ్గురు దుండగులు కాల్చి చంపారు. ఈ నేపథ్యంలో యూపీలో రౌడీల ఏరివేత పేరుతో బూటకపు ఎన్ కౌంటర్లు చేస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి. దాంతో, 2017 నుంచి యూపీలో జరిగిన 183 ఎన్‌కౌంటర్లపై దర్యాప్తు చేసేందుకు స్వతంత్ర నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో తాజాగా పిటిషన్ దాఖలైంది. 

గ్యాంగ్‌స్టర్ అతీక్ హత్య ఘటన తర్వాత ఈ మేరకు న్యాయవాది విశాల్ తివారీ ఒక ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. ఉత్తరప్రదేశ్ స్పెషల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఆధ్వర్యంలో 2017వ సంవత్సరం నుంచి జరిగిన 183 ఎన్‌కౌంటర్‌లపై విచారణకు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి అధ్యక్షతన స్వతంత్ర నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని ఆయన అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. పోలీసుల సమక్షంలోనే అతీక్, అతని సోదరుడు అష్రఫ్‌ల హత్య గురించి కూడా ప్రశ్నించారు. ఇలాంటి ఘటనలు ప్రజాస్వామ్యానికి, న్యాయవ్యవస్థకు పెను ముప్పు అన్నారు. పోలీసులు చట్టాన్ని చేతులోకి తీసుకుంటే  మొత్తం న్యాయవ్యవస్థ కూలిపోతుందని, వారిపై ప్రజల్లో భయాన్ని సృష్టిస్తుందని పిటిషనర్ అభిప్రాయపడ్డారు. ఈ పిల్ ను సుప్రీంకోర్టు విచారణకు తీసుకుంటుందో లేదో చూడాలి.

  • Loading...

More Telugu News