Nara Lokesh: ఎమ్మెల్యే శ్రీదేవి గారూ ఇప్పుడేమంటారు?: నారా లోకేశ్

  • పత్తికొండ నియోజకవర్గంలో లోకేశ్ పాదయాత్ర
  • స్థానిక వైసీపీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవిపై లోకేశ్ ఆరోపణలు
  • శ్రీదేవి గ్యాంగ్ భూ ఆక్రమణలకు పాల్పడిందని వెల్లడి
  • ఆరోపణలను ఖండించిన ఎమ్మెల్యే శ్రీదేవి
  • నేడు ఆధారాలు విడుదల చేసిన లోకేశ్
Nara Lokesh questions Pathikonda MLA Sridevi

నారా లోకేశ్ యువగళం పాదయాత్ర 72వ రోజు పాదయాత్ర అసెంబ్లీ నియోజకవర్గంలో శనివారం కోలాహలంగా సాగింది. మండుటెండలను సైతం లెక్కచేయకుండా జనం రోడ్లపైకి వచ్చి లోకేశ్ ను స్వాగతించారు. ఇక, ఎంకే కొట్టాల వద్ద యువగళం పాదయాత్ర ఆలూరు అసెంబ్లీ నియోజకవర్గంలో ప్రవేశించింది. ఆలూరు టీడీపీ ఇన్ చార్జి కోట్ల సుజాతమ్మ నేతృత్వంలో కార్యకర్తలు, అభిమానులు లోకేశ్ కు ఘనస్వాగతం పలికారు.

వైసీపీ ఎమ్మెల్యే శ్రీదేవి గ్యాంగ్ క‌బ్జా ఆధారాలు ఇవిగోండి!

శ‌నివారం ప‌త్తికొండ బ‌హిరంగ‌స‌భ‌లో నారా లోకేశ్ ఎమ్మెల్యే శ్రీదేవి వర్గంపై ఆరోపణలు చేయడం తెలిసిందే. చెర్లకొత్తూరు గ్రామానికి చెందిన దళితుల భూములను వైసీపీ నేతలు ఆక్రమించుకున్నార‌ని ఆరోపించారు. దీనిపై ఎమ్మెల్యే శ్రీదేవి మాట్లాడుతూ ఆ క‌బ్జాల‌తో త‌న‌కు సంబంధంలేద‌ని, అవినీతి చేయ‌లేద‌ని ప్రెస్‌మీట్ పెట్టారు. ఈ నేపథ్యంలో, తన ఆరోపణలకు సంబంధించిన ఆధారాల‌ను లోకేశ్ బ‌య‌ట‌పెట్టారు.

"పేరేముల గ్రామంలోని సర్వే నెం.249, 250లలో 25 ఎకరాల భూమిని 1986లో గోపాల్ నాయక్, ఆనంద్ నాయక్ ల నుంచి 12 మంది ద‌ళితులు కొనుగోలు చేసి అగ్రిమెంట్ చేయించుకున్నారు. 35 సంవత్సరాలకు ద‌ళితులు సాగుచేసుకుంటున్న భూమిని 2020లో ఓబులాపురానికి చెందిన విష్ణువర్థన్ రెడ్డి పేరిట దొంగ డాక్యుమెంట్లతో ఆన్ లైన్ చేసుకున్నారు. వైసీపీ నేతలు భూమన్నగారి సంజీవరెడ్డి, ఒడ్డూరు వరలక్ష్మి, పోతిరెడ్డిగారి అరుణమ్మ, అలవాల సూర్యనారాయణరెడ్డిలు భూమిని క‌బ్జా చేశారు. 

అధికారుల‌ని ఆశ్రయిస్తే స్పందించ‌డంలేదు. భూమిలోకి వస్తే చంపేస్తామంటూ వైసీపీ నేతలు బెదిరిస్తున్నారు. పోలీసుల్ని పంపి అక్రమ‌కేసులు బ‌నాయిస్తున్నారు. న్యాయం చేయాలని ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి దగ్గరకు వెళితే ఆ భూమి ద‌ళితుల‌కి చెందిన‌ది కాదంటూ పొమ్మంటున్నారు.

ద‌ళితులు 35 ఏళ్లుగా అనుభ‌విస్తున్న భూముల‌కి సంబంధించిన ప‌త్రాలు, ఇవి మీ వైసీపీ నేత‌ల‌కి ఎలా మారాయి, ఎలా క‌బ్జా జ‌రిగాయో క‌ళ్లకు క‌ట్టిన‌ట్టున్న ఆధారాలు ఇవి. ఇప్పుడేమంటారు ఎమ్మెల్యే గారూ?" అంటూ లోకేశ్ ప్రశ్నించారు.

స్టిక్కర్ సీఎంకు పోటీగా స్టిక్కర్ ఎమ్మెల్యే!

పత్తికొండ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి పబ్లిసిటీలో ముఖ్యమంత్రి జగన్ రెడ్డికి ఏమాత్రం తగ్గడంలేదని నారా లోకేశ్ ఎద్దేవా చేశారు. వైసీపీ ప్రభుత్వం తాము ఫలానా పని చేశామని చెప్పుకోలేక, టీడీపీ ప్రభుత్వంలో చేపట్టిన పనులు తాము చేసినట్లు రంగులు వేయించుకుని ప్లెక్సీలు కట్టుకుంటున్నారని ఆరోపిచారు. 

ఎన్టీఆర్ సుజల పథకం కింద ప్రజల దాహార్తిని తీర్చేందుకు టీడీపీ ప్రభుత్వం అన్ని గ్రామాల్లో మాదిరిగానే పత్తికొండ నియోజకవర్గంలో కూడా సుజల మినరల్ వాటర్ ప్లాంట్లను ఏర్పాటు చేసింది. వైసీపీ అధికారంలోకి వచ్చాక ఈ పథకానికి నెలరోజుల పాటు నీళ్లు ఇచ్చి, తర్వాత నిలిపేశారు. ఉప్పర్లపల్లి వద్ద నీటిని శుద్ధిచేసే కేంద్రం ఉంది. జగన్ రెడ్డి సీఎం అయ్యాక శుద్ధికేంద్రాలకు నిధులు కేటాయించకపోవడంతో నిర్వాహకులు చేతులెత్తేశారు" అని విమర్శించారు.

లోకేశ్ ను కలిసి కన్నీళ్లు పెట్టుకున్న కానిస్టేబుల్

30 ఏళ్లుగా పోలీసు సర్వీసులో ఉన్నా ఏనాడూ ఇన్నీ కష్టాలు పడలేదని ఓ కానిస్టేబుల్ టీడీపీ అగ్రనేత లోకేశ్ ఎదుట కన్నీళ్లు పెట్టుకున్నారు. పత్తికొండ నియోజకవర్గం మారెళ్ల శివార్లలో భోజన విరామ సమయంలో ఓ కానిస్టేబుల్ లోకేశ్ ను కలిసి తాము ఎదుర్కొంటున్న కష్టాలను మొరపెట్టుకున్నాడు. 

బయటి ప్రాంతాలకు విధులకు వెళితే కనీసం భోజనాలకు కూడా ప్రభుత్వం డబ్బులివ్వడం లేదని వాపోయారు. జేబులో డబ్బులు ఖర్చుపెట్టాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఒక్కొక కానిస్టేబుల్ కు టీఏ, డీఏల రూపంలో రూ.2లక్షల వరకు ప్రభుత్వం నుంచి రావాల్సి ఉందని వెల్లడించారు. 

"గతంలో విదేశీ విద్య పథకం కింద మా పిల్లల ఉన్నత చదువులకు అవకాశం ఉండేది. గత నాలుగేళ్లుగా దరఖాస్తులు పంపితే రకరకాల సాకులతో తిప్పి పంపుతున్నారు. అప్పులు చేసి మా బిడ్డలను చదివించుకుంటున్నాం. అడ్డగోలు పనులను అడ్డుకుంటే అంతు చూస్తామంటూ వైసీపీ నేతలు ఫోన్లు చేసి బెదిరిస్తున్నారు. కొన్నిసార్లు పోలీస్ స్టేషన్ కు వచ్చి నానా బూతులు తిడుతున్నారు. 

అధికార పార్టీ పెద్దల ఒత్తిడితో తప్పనిసరి పరిస్థితుల్లో మనసు చంపుకొని కొన్నిసార్లు నిబంధనలు అతిక్రమించి పనిచేయాల్సి వస్తోంది. మీరు అధికారంలోకి వచ్చాక పెద్ద మనసుతో మమ్మల్ని ఆదుకోండి. మా బిడ్డల ఉన్నత విద్యాభ్యాసానికి సాయం అందించండి. టీఏ, డీఏల బకాయిలను చెల్లించి మమ్నల్ని అప్పుల ఊబినుంచి బయటపడేయండి. స్వేచ్చగా విధినిర్వహణ చేసే అవకాశం కల్పించండి" అని లోకేశ్ కు విజ్ఞప్తి చేశారు. 


*యువగళం పాదయాత్ర వివరాలు:*

*ఇప్పటి వరకు నడిచిన దూరం 933 కి.మీ.*

*ఈరోజు నడిచిన దూరం 15.4 కి.మీ.*

*73వరోజు (17-4-2023) యువగళం వివరాలు:*

*ఆలూరు అసెంబ్లీ నియోజకవర్గం (కర్నూలు జిల్లా):*

ఉదయం

7.00 – ఎం.కె కొట్టాల క్యాంప్ సైట్ నుంచి పాదయాత్ర ప్రారంభం.

7.05 – ఎం.కె కొట్టాలలో స్థానికులతో మాటామంతీ.

8.40 – గుండ్లకొండలో గ్రామస్తులతో భేటీ.

9.50 – గుడిమిర్ల గ్రామంలో రైతులతో సమావేశం.

11.00 – బుర్రుకుంటలో స్థానికులతో సమావేశం.

11.40 – వెంకటాపురం శివార్లలో రైతులతో ముఖాముఖి.

మధ్యాహ్నం

12.40 – వెంకటాపురం శివార్లలో భోజన విరామం.

సాయంత్రం

4.00 – వెంకటాపురం శివార్ల నుంచి పాదయాత్ర కొనసాగింపు.

5.00 – వెంకటాపురంలో స్థానికులతో సమావేశం.

6.40 – పల్లెదొడ్డి విడిది కేంద్రంలో బస.

More Telugu News