Ateeq Ahmed: పేరు తెచ్చుకోవాలనే ఆ ఇద్దరినీ చంపేశాం: అతీక్, అష్రఫ్ హంతకులు

  • దుండగుల కాల్పుల్లో మాజీ ఎంపీ అతీక్ అహ్మద్, సోదరుడు అష్రఫ్ హతం
  • జర్నలిస్టు వేషాల్లో వచ్చి కాల్పులు జరిపిన యువకులు
  • ముగ్గురు హంతకులను అదుపులోకి తీసుకున్న పోలీసులు
  • రాష్ట్రవ్యాప్తంగా తమకు గుర్తింపు వస్తుందన్న నిందితులు
Ateeq and Ashraf killers told they murdered them for fame

ఉత్తరప్రదేశ్ లో పోలీసుల అదుపులో ఉన్న గ్యాంగ్ స్టర్, మాజీ ఎంపీ అతీక్ అహ్మద్, అతడి సోదరుడు అష్రఫ్ దారుణ హత్యకు గురికావడం తెలిసిందే. ఓ కేసులో అతీక్, అష్రఫ్ లను పోలీసులు వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి తీసుకురాగా, పాత్రికేయుల్లా వచ్చిన ముగ్గురు యువకులు ఒక్కసారిగా కాల్పులు జరపడం సంచలనం సృష్టించింది. 

ఈ ఘటనలో అతీక్, అష్రఫ్ రక్తపుమడుగులో కూలిపోయి అక్కడిక్కడే మరణించారు. ఈ కాల్పులకు పాల్పడిన ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. వారిని లావ్లేష్ తివారీ, మోహిత్ (సన్నీ), అరుణ్ మౌర్య అని గుర్తించారు. తాము ఒక్కసారిగా గుర్తింపు తెచ్చుకోవాలన్న ఉద్దేశంతోనే అతీక్, అష్రఫ్ లను చంపేశామని ఆ ముగ్గురు వెల్లడించారు. 

రాష్ట్రవ్యాప్తంగా తమకు పేరొస్తుందని, భవిష్యత్తులో అది తమకు ఎంతో ఉపయోగపడుతుందని భావించామని తెలిపారు. అతీక్, అష్రఫ్ లను పోలీసు కస్టడీకి అప్పగించినట్టు తెలిసిందని, దాంతో వారిద్దరి హత్యకు ప్రణాళిక రచించామని వివరించారు. 

జర్నలిస్టుల్లా వచ్చి కాల్పులు జరిపామని, ఈ ఘటన తర్వాత పారిపోవాలని తాము భావించలేదని వెల్లడించారు. ఈ మేరకు నిందితులు చెప్పిన వివరాలను పోలీసులు ఎఫ్ఐఆర్ లో పొందుపరిచారు.

More Telugu News