Sudan: సుడాన్‌లో ఘర్షణలకు భారతీయుడు బలి

  • సుడాన్‌లో మిలిటరీ పారామిలిటరీ దళాల మధ్య ఘర్షణలు
  • ప్రమాదవశాత్తూ కాల్పుల్లో చిక్కి భారతీయుడు దుర్మరణం
  • ప్రకటించిన ఇండియన్ ఎంబసీ
Indian in sudan dies after stray bullet hits him

సుడాన్‌లో సైన్యం, పారామిలిటరీ దళాల మధ్య జరుగుతున్న ఘర్షణలో ఓ భారతీయుడు ప్రమాదవశాత్తూ దుర్మరణం చెందాడు. ఘర్షణ సమయంలో ఓ తూటా శరీరంలోకి దూసుకుపోవడంతో అసువులు బాసాడు. మృతుడిని ఆల్బర్ట్ అగస్టీన్‌గా గుర్తించారు. ఈ మేరకు సుడాన్‌లోని ఇండియన్ ఎంబసీ సోషల్ మీడియాలో ఓ ప్రకటన విడుదల చేసింది. మృతుడి కుటుంబ సభ్యులకు సమాచారం అందించామని, తదుపరి ఏర్పాట్లు చేస్తున్నామని పేర్కొంది. సుడాన్‌లోని దాల్ గ్రూప్ కంపెనీలో ఆల్బర్ట్ పనిచేసేవారు. 

సైన్యంలో పాలామిలిటరీ దళాల విలీనంపై రెండు దళాల మధ్యా కొంత కాలంగా నెలకొన్న బేధాభిప్రాయాలు చివరకు ఘర్షణలకు దారి తీసాయి. సుడాన్ రాజధాని ఖార్తూమ్ సహా దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో రెండు దళాలు పరస్పరం దాడులు చేసుకున్నాయి. బాంబు దాడులు, తుపాకీ కాల్పులతో పలు ప్రాంతాలు దద్దరిల్లుతున్నాయి. ఈ క్రమంలో సుడాన్‌లోని భారతీయులు అప్రమత్తంగా ఉండాలంటూ ఇటీవలే ఇండియన్ ఎంబసీ హెచ్చరించింది. అనవసరంగా ఇళ్లల్లోంచి బయటకు రావద్దని హెచ్చరించింది. ఈ ప్రకటన వెలువడిన మరుసటి రోజే ఓ భారతీయుడు సైనిక దళాల ఘర్షణకు బలయిపోయాడు.

More Telugu News