Weight Loss: సాయంత్రం నడిస్తే వచ్చే ప్రయోజనాలు ఇవీ..

  • మెదడు పనితీరులో పురోగతి
  • రక్త ప్రసరణ, ఆక్సిజన్ సరఫరా మెరుగుదల
  • రక్తపోటు నియంత్రణ, గుండె జబ్బుల నుంచి రక్షణ
  • బరువు, ఒత్తిడి తగ్గడానికి మంచి మందు
Weight Loss Tips 7 Health Benefits Of Early Evening Walk

నడక ఆరోగ్యానికి ఎంతో మంచిదని తరచూ వింటుంటాం. అయితే రోజులో ఏ సమయంలో నడిస్తే ఎక్కువ ప్రయోజనం ఉంటుందనే విషయమై చాలా మందిలో సందేహం ఉంటుంది. కొందరు ఉదయం నడిస్తే మంచిదంటారు. కొందరు సాయంత్రం నడవాలంటారు. దీంతో కొంత అయోమయం కూడా నెలకొంది. సాయంత్రం ఆరంభం కాగానే నడవడం వల్ల కలిగే ప్రయోజనాలపై నిపుణుల వివరణ ఓ సారి పరిశీలిద్దాం.

నిద్ర నాణ్యత
సాయంత్రం వేళ నడవడం వల్ల మన బయో క్లాక్ క్రమబద్ధంగా పనిచేసి, రాత్రి ముందుగా మంచి నిద్ర పడుతుందని నిపుణులు చెబుతున్నారు. రోజులో సహజ కాంతికి గురికావడం వల్ల మన శరీరంలో మెలటోనిన్ అనే రసాయనం సాయంత్రం సమయంలో ఎక్కువగా ఉత్పత్తి అయ్యేందుకు సాయపడుతుంది. మన మెదడుకు నిద్ర సంకేతాలు ఇచ్చి, మంచి నిద్రకు కారణమయ్యేది ఇదే. మన శరీరంలోని సర్కాడియమ్ రిథమ్ కూడా బలపడుతుంది. మంచి నిద్రకు ఇది సాయపడుతుంది.

ఒత్తిడి
ఒత్తిడిని తగ్గించుకునేందుకు నడక మంచి ప్రత్యామ్నాయం. సాయంత్రం అంటే ఎప్పుడో 7 తర్వాత కాకుండా, 5.30-6.30 గంటల మధ్య మరింత ప్రయోజనకరంగా ఉంటుంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు పనిచేసి ఉంటాం. దీని తాలూకూ ఒత్తిడి మన మెదడుపై ఉంటుంది. నడవడం వల్ల అదంతా వదిలించుకుని, ప్రశాంతతను పొందొచ్చు. దీనివల్ల కూడా రాత్రి నిద్ర మెరుగుపడుతుంది.

గుండెకు మంచిది
నడక గుండెకు ఎంతో మంచి చేస్తుంది. నడకతో రక్తపోటు నియంత్రణలోకి వస్తుంది. గుండె కండరాలు బలపడతాయి. రక్త ప్రసరణ కూడా మెరుగు అవుతుంది. ఇన్ ఫ్లమ్మేషన్ తగ్గి, రక్తంలో షుగర్ కూడా నియంత్రణలో ఉంటుంది.

శక్తినిస్తుంది..
నీరసంగా ఉన్నా సరే.. నడిచి చూడండి. శక్తి, ఉత్సాహం పెరుగుతాయని పలు అధ్యయనాలు వెల్లడించాయి. ఎందుకంటే పని కారణంగా అలసిపోయిన మనసుకు, శరీరానికి నడక పునరుత్తేజాన్నిస్తుంది. దాంతో ఉత్సాహం, శక్తి పెరుగుతాయి.

బరువు నియంత్రణ
బరువు తగ్గాలని అనుకునే వారికి రోజువారీ నడక మంచి మార్గం అవుతుంది. ఎంత మేర బరువు తగ్గుతారనేది అందరికీ ఒకే రకంగా ఉండదు. వేగవంతమైన నడక కనీసం 40 నిమిషాల పాటు చేయడం వల్ల మంచి ఫలితం చూడొచ్చు. జీవక్రియలు చురుగ్గా మారడం వల్ల బరువు తగ్గుతారు. 

మెదడుకూ మంచిదే
నడకతో మెదడులో కాగ్నిటివ్ పనితీరు బలపడుతుందని పలు అధ్యయనాలు పేర్కొన్నాయి. జ్ఞాపకశక్తి కూడా బలపడుతుంది. ఎందుకంటే మెదడుకు రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. ఫలితంగా ఒత్తిడి తగ్గిపోతుంది. మెదడుడికి ఆక్సిజన్ సరఫరా పెరుగుతుంది.

More Telugu News