NV Ramana: పురాణాల్లోనూ మీడియేషన్.. కౌరవులు, పాండవుల మధ్య కృష్ణుడు మధ్యవర్తిత్వం చేశారు..: జస్టిస్ ఎన్వీ రమణ

justice nv ramana participated in first indian meditation day programme in iamc hyderabad
  • మధ్యవర్తిత్వంతో ఏళ్ల తరబడి కోర్టుల చుట్టూ తిరిగే బాధ తప్పుతుందన్న జస్టిస్ ఎన్వీ రమణ
  • ఈ ప్రక్రియ సమస్యల పరిష్కారంలో కీలక పాత్ర పోషిస్తోందని వ్యాఖ్య
  • మీడియేషన్ కు ప్రాధాన్యం క్రమంగా పెరుగుతోందని వెల్లడి 

మధ్యవర్తిత్వానికి ప్రాధాన్యం క్రమంగా పెరుగుతోందని సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ అన్నారు. సమస్యల పరిష్కారంలో మధ్యవర్తిత్వం కీలక పాత్ర పోషిస్తోందని చెప్పారు. మీడియేషన్ వల్ల ఏళ్ల తరబడి కోర్టుల చుట్టూ తిరిగే బాధ తప్పుతుందని వ్యాఖ్యానించారు. 

హైదరాబాద్‌ ఐఏఎంసీలో జరుగుతున్న ఇండియా మీడియేషన్‌ డే కార్యక్రమంలో మాజీ సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ, సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ హిమా కోహ్లి, సింగపూర్‌ అంతర్జాతీయ మీడియేషన్‌ సెంటర్‌ చైర్మన్‌ జార్జ్‌ లిమ్‌ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జస్టిస్‌ ఎన్వీ రమణ మాట్లాడుతూ.. మొదటి ఇండియా మీడియేషన్‌ డే కార్యక్రమంలో పాల్గొన్నందుకు ఎంతో సంతోషంగా ఉందన్నారు. 

‘‘మీడియేషన్ అనేది మన పురాణాల కాలంలోనూ ఉంది. కౌరవులు, పాండవుల మధ్య కృష్ణుడి మధ్యవర్తిత్వం విఫలం వల్లే మహాభారత యుద్ధం జరిగింది’’ అని జస్టిస్ ఎన్వీ రమణ చెప్పారు. ఆర్థిక సంస్కరణల కారణంగా మధ్యవర్తిత్వ ప్రాధాన్యం భారత్‌లోనూ పెరిగిందని తెలిపారు. అయితే ఈ ప్రక్రియ వేగవంతంగా, విశ్వసనీయతతో సాగాలని అభిప్రాయపడ్డారు. ఉభయపక్షాలకు ఉపయోగకరంగా సాగాలని సూచించారు. 

జడ్జిగా తనకు 22 ఏళ్ల అనుభవం ఉందని జస్టిస్ రమణ చెప్పారు. హైదరాబాద్‌లో మీడియేషన్‌ కేంద్రం ఏర్పాటుపై తాను, జస్టిస్‌ లావు నాగేశ్వరరావు ఎన్నోసార్లు చర్చించుకున్నామని చెప్పారు. మొదట్లో తాను చిన్న స్థాయిలో కేంద్రం ఏర్పాటు చేద్దామనుకున్నానని తెలిపారు. కానీ.. జస్టిస్‌ నాగేశ్వరరావు దాన్ని అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్దారని, జస్టిస్‌ హిమకోహ్లి కూడా ఎంతో సహకరించారని వెల్లడించారు.

న్యాయ వ్యవస్థలో మధ్యవర్తిత్వం ఓ కీలకమైన అంశమని జస్టిస్‌ హిమకోహ్లి అన్నారు. సమస్యల పరిష్కారంలో ప్రధాన పాత్ర వహిస్తుందన్నారు. చోళుల కాలంలోనూ మధ్యవర్తిత్వం కోసం ప్రత్యేక వ్యవస్థ ఉండేదని చెప్పారు.

హైదరాబాద్‌లోని మీడియేషన్‌ కేంద్రం చూసి ఆశ్చర్యపోయానని జస్టిస్‌ రవీంద్రన్‌ అన్నారు. మధ్యవర్తిత్వ సంస్కృతి పెరగాల్సిన అవసరం ఎంతో ఉందని చెప్పారు. మీడియేషన్ గురించి చాలామందికి ఇంకా తెలియదన్నారు. కోర్టు వివాదాల వల్ల ఎంతో సమయం, డబ్బు వృథా అవుతాయన్నారు. వందల కోట్లతో ముడిపడిన సమస్యలు కూడా మీడియోషన్ వల్ల రోజుల్లోనే పరిష్కరించవచ్చని తెలిపారు.

  • Loading...

More Telugu News