Karnataka: నాకు టికెట్ ఇవ్వకుంటే బీజేపీ 20 నుంచి 25 సీట్లు కోల్పోతుంది: జగదీశ్ షెట్టర్

  • బీజేపీ హైకమాండ్ ను హెచ్చరించిన కర్ణాటక మాజీ సీఎం
  • ఈ రోజు సాయంత్రం వరకూ వేచి చూస్తానని ప్రకటించిన షెట్టర్
  • కర్ణాటకలో టికెట్ దక్కని బీజేపీ నేతల అసమ్మతి గళం
  • షెట్టర్ తో కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి చర్చలు
  • మరో 12 స్థానాలకు అభ్యర్థులను ఇంకా ప్రకటించని పార్టీ
Denying Me Ticket Can Cost 20 to 25 Seats says Karnataka BJP Leader jagadeesh shettar

‘నాకు టికెట్ నిరాకరిస్తే దాని ప్రభావం మొత్తం కర్ణాటకపైనా పడుతుంది.. వచ్చే ఎన్నికల్లో 20 నుంచి 25 అసెంబ్లీ స్థానాలను పార్టీ కోల్పోతుంది’ అంటూ  బీజేపీ సీనియర్ నేత, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి జగదీశ్ షెట్టర్ అన్నారు. బీజేపీ హైకమాండ్ ను పరోక్షంగా హెచ్చరించారు. అయితే, పార్టీ హైకమాండ్ తనకు తప్పకుండా టికెట్ ఇస్తుందనే నమ్మకం తనకు ఉందన్నారు. ఆదివారం సాయంత్రం వరకు వేచి చూసి ఆపై తన భవిష్యత్ కార్యాచరణపై నిర్ణయం తీసుకుంటానని షెట్టర్ తెలిపారు.

వచ్చే నెల 10న జరగబోయే కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి బీజేపీ రెండు విడతలుగా 212 మంది అభ్యర్థులను ప్రకటించింది. సీనియర్ నేతలు, సిట్టింగ్ ఎమ్మెల్యేలను పక్కన పెట్టి మొత్తం 50 మంది కొత్తవారికి పార్టీ టికెట్ ఇచ్చింది. దీనిపై పార్టీ రాష్ట్ర నేతలలో అసంతృప్తి వ్యక్తమవుతోంది. కొందరు ఇప్పటికే పార్టీకి రాజీనామా చేయగా.. మరికొందరు హైకమాండ్ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మరో 12 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉండడంతో కొందరు నేతలు పార్టీ టికెట్ కోసం ఇంకా ప్రయత్నిస్తున్నారు. టికెట్ దక్కని నేతలలో ఆ పార్టీ సీనియర్ నేత, రాష్ట్రానికి గతంలో ముఖ్యమంత్రిగా సేవలందించిన జగదీశ్ షెట్టర్ కూడా ఉన్నారు.

షెట్టర్ కు టికెట్ దక్కకపోవడంతో హుబ్బళి-ధార్వాడ్ లో ఆయన మద్దతుదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. హుబ్బళి-ధార్వాడ్ మున్సిపల్ కార్పొరేషన్ లో 16 మంది కౌన్సిలర్లు తమ పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో జగదీశ్ షెట్టర్ ను బుజ్జగించేందుకు కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి ప్రయత్నించారు. షెట్టర్ ను కలిసి మాట్లాడారు. పార్టీ హైకమాండ్ తో చర్చించి నిర్ణయం తీసుకుంటామని జోషి వివరించారు. మరోవైపు, షెట్టర్ సేవలు పార్టీకి అవసరమని, ఆయనను పార్టీ వదులుకోదని సీఎం బసవరాజు బొమ్మై పేర్కొన్నారు.

More Telugu News