Covid: పదేళ్లలో కరోనా మాదిరి మరో విపత్తు..!

  • వచ్చే అవకాశాలు 27.5 శాతం ఉన్నాయన్న లండన్ సంస్థ
  • వ్యాధి నిరోధక టీకాలే మేలైన పరిష్కారమని వెల్లడి
  • వైరస్ వచ్చిన 100 రోజుల్లోపు టీకాలు ఇవ్వాలన్న సూచన
Another Covid like global pandemic possible in 10 years

కరోనా మహమ్మారి రెండేళ్ల పాటు ప్రపంచాన్ని గడగడలాడించి కోట్లాది మంది ప్రాణాలను బలి తీసుకుంది. కరోనా ప్రభావం గణనీయంగా తగ్గుముఖం పట్టిందని స్వేచ్ఛగా ఊపిరి తీసుకుంటుంటే.. తాజాగా ఈ కేసులు మరోసారి పెరుగుతూ ఆందోళనకు గురి చేస్తున్నాయి. మరోవైపు వచ్చే పదేళ్ల కాలంలో కరోనా మాదిరి ప్రాణాంతకమైన వైరస్ వెలుగు చూస్తుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. 

కరోనా మాదిరి ప్రాణాంతక వైరస్ మళ్లీ పదేళ్లలో వచ్చే అవకాశాలు 27.5 శాతం ఉన్నట్టు నిపుణులు చెబుతున్నారు. తరచూ కొత్త కొత్త వైరస్ లు వస్తూనే ఉంటాయన్న విషయాన్ని లండన్ కేంద్రంగా పనిచేస్తున్న ఎయిర్ ఫినిటీ లిమిటెడ్ ప్రస్తావించింది. వాతావరణంలో మార్పులు, అంతర్జాతీయ ప్రయాణాలు పెరగడం, జనాభా పెరుగుదలను గుర్తు చేస్తోంది. కనుక ప్రజలకు టీకాలను ఇవ్వడమే వైరస్ లను ఎదుర్కొనే బలమైన ఆయుధం అవుతుందని పేర్కొంది.

కొత్తగా ఏదైనా వ్యాధి కారక వైరస్ వెలుగు చూసిన వెంటనే వంద రోజుల్లోపు వ్యాక్సిన్ ఇచ్చినట్టయితే.. అప్పుడు కరోనా మాదిరి ప్రాణాంతక వైరస్ అవతరించే అవకాశాలు 8.1 శాతానికి తగ్గుతాయని ఎయిర్ ఫినిటీ తెలిపింది. మరింత దారుణ పరిస్థితుల్లో బర్డ్ ఫ్లూ టైప్ వైరస్ బ్రిటన్ లో ఒక్క రోజులోనే 15 వేల మందిని అంతం చేయగలదని పేర్కొంది. భారత్ గత రెండు దశాబ్దాల్లో సార్స్, మెర్స్, కరోనా వైరస్ లను ఎదుర్కొనడం గమనార్హం. 2009లో స్వైన్ ఫ్లూ కూడా మన దేశాన్ని వణికించింది.

More Telugu News