Amit Shah: 35 ఎంపీ సీట్లిస్తే దీదీ పాలనకు ముగింపు పలుకుతాం: అమిత్ షా

  • పశ్చిమ బెంగాల్ లోని బీర్భూమ్ లో కేంద్ర హోంమంత్రి ర్యాలీ
  • అవినీతి పాలనకు చెక్ పెట్టడం బీజేపీతోనే సాధ్యమని వెల్లడి
  • సీజన్ లో వచ్చిపోయే పక్షిలాంటోడని అమిత్ షాపై టీఎంసీ నేతల విమర్శలు
Give Us 35 Seats And Mamata Banerjee Will Be Out says Amit Shah

‘పశ్చిమ బెంగాల్ లో పాతుకుపోయిన అవినీతిని అరికట్టే శక్తి మాకు మాత్రమే ఉంది.. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో బీజేపీని 35 స్థానాల్లో గెలిపిస్తే రాష్ట్రంలో మమతా బెనర్జీ పాలనకు ముగింపు పలుకుతాం’ అని కేంద్ర హోంమంత్రి అమిత్ షా బెంగాల్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈమేరకు శనివారం పశ్చిమ బెంగాల్ లోని బీర్భూమ్ జిల్లాలో బీజేపీ నిర్వహించిన ర్యాలీలో కేంద్ర మంత్రి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ.. గత లోక్ సభ ఎన్నికల్లో 18 స్థానాల్లో బీజేపీ అభ్యర్థులను గెలిపించారని గుర్తుచేశారు. దీంతో రాష్ట్రంలో గోవుల అక్రమరవాణాను అరికట్టామని చెప్పారు. ఈసారి 35 సీట్లిస్తే రాష్ట్రంలో అవినీతి పాలనకు ముగింపు పలుకుతామని హామీ ఇచ్చారు. పశ్చిమ బెంగాల్ లో మమతా బెనర్జీ, ఆమె మేనల్లుడు అభిషేక్ బెనర్జీల అవినీతి పాలనకు చెక్ పెట్టడం బీజేపీకి మాత్రమే సాధ్యమని షా చెప్పారు.

టీఎంసీకి ప్రత్యామ్నాయం కేవలం బీజేపీ మాత్రమేనని తేల్చిచెప్పారు. రాష్ట్రంలోకి చొరబాటుదారులను ఆహ్వానించాలని అనుకుంటున్నారా? చొరబాట్లను అడ్డుకోవాలని భావిస్తున్నారా? అని ప్రజలను ప్రశ్నించారు. విదేశాల నుంచి అక్రమంగా రాష్ట్రంలోకి వచ్చే వారిని అడ్డుకోవాలన్నా, అవినీతి పాలనకు అడ్డుకట్ట వేయాలన్నా బీజేపీకి ఓటేయడమే మార్గమని అమిత్ షా ప్రజలకు సూచించారు.

ఇక అమిత్ షా బీర్భూమ్ లో చేసిన వ్యాఖ్యలపై తృణమూల్ కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు. సీజన్ లో మాత్రమే వచ్చి పోయే పక్షిలాగా కేంద్ర మంత్రి అమిత్ షా కేవలం ఎన్నికలు ఉన్నప్పుడే రాష్ట్రానికి వస్తారని విమర్శించారు. పశ్చిమ బెంగాల్ కు వచ్చి చెత్త మాటలు మాట్లాడడం మానుకుని ఢిల్లీలోనే కూర్చుని తన పని చేసుకోవాలని అమిత్ షాకు సలహా ఇచ్చారు.

డబ్బు తీసుకుంటూ కెమెరాకు చిక్కిన సువేందు అధికారిని పక్కన కూర్చోబెట్టుకుని అమిత్ షా అవినీతి గురించి మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందని బెంగాల్ మంత్రి శశి పంజా ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో అభివృద్ధి పనుల కోసం కలవడానికి వెళ్లిన బెంగాల్ ఎంపీలకు కేంద్ర మంత్రి కనీసం అపాయింట్ మెంట్ కూడా ఇవ్వలేదని ఆయన గుర్తుచేశారు. బెంగాల్ కు ఉపాధి నిధుల విడుదలపైనా అమిత్ షా నోరు మెదపడంలేదని మండిపడ్డారు.

More Telugu News