North Korea: కొత్త రకం బాలిస్టిక్ క్షిపణిని పరీక్షించిన ఉత్తర కొరియా.. ప్రత్యర్థి దేశాల వెన్నులో వణుకు

  • ఘన-ఇంధన ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి 'హ్వాసాంగ్-18' పరీక్ష విజయవంతం
  • పరీక్షను పర్యవేక్షించిన దేశ నాయకుడు కిమ్ జోంగ్ ఉన్
  • ఇటీవల అమెరికా-దక్షిణ కొరియా సంయుక్త సైనిక విన్యాసాలపై ఉత్తర కొరియా ఆగ్రహం
 North Korea test fires new solid fuel long range missile warns of extreme horror to rivals

భారీ అణ్వాయుధాలను కలిగి ఉన్న ఉత్తర కొరియా మరోసారి తన బల ప్రదర్శన చేసింది. దేశ అణ్వాయుధ ఎదురుదాడి సామర్థ్యాన్ని సమూలంగా ప్రోత్సహించే ప్రయత్నంలో భాగంగా కొత్త ఘన-ఇంధన ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి (ఐసీబీఎమ్) 'హ్వాసాంగ్-18' ను శుక్రవారం పరీక్షించినట్లు ఉత్తర కొరియా తెలిపింది. దీన్ని దేశ నాయకుడు కిమ్ జోంగ్ ఉన్ పర్యవేక్షించారని వెల్లడించింది. 

ఈ పరీక్షతో తన ప్రత్యర్థుల్లో వణుకు పుట్టించేలా చేసిన ఉత్తర కొరియా తన అణ్వాయుధాలను మరింత విస్తరించే సంకేతాన్ని ఇచ్చింది. ఉత్తర కొరియా ప్రయోగిస్తున్న క్షిపణి తమ భూభాగంలో పడుతుందంటూ జపాన్ గురువారం ఆందోళన వ్యక్తం చేసింది. హొక్కైడో ప్రాంతంలోని జనాలు ఇళ్లను ఖాళీ చేయాలని ఆదేశాలు ఇచ్చి తర్వాత ఉపసంహరించుకుంది. నార్త్ కొరియా భూభాగంలో తాజా పరీక్ష జరగడంతో జపాన్ ఊపిరిపీల్చుకుంది.
 
కాగా, ఇటీవలి అమెరికా-దక్షిణ కొరియా సంయుక్త సైనిక విన్యాసాలపై ఉత్తర కొరియా తీవ్ర విమర్శలు చేస్తున్న నేపథ్యంలో  తాజా ప్రయోగం జరగడం చర్చనీయాంశమైంది. ఉత్తర కొరియా, యుఎస్ఏ మధ్య ఉద్రిక్తతను ఇది మరింత పెంచుతోంది. ఘన-ఇంధన ఐసీబీఎం విజయవంతమైన ప్రయోగం అగ్ర రాజ్యానికి ఇబ్బందిని కలిగించేలా ఉంది. అంతర్నిర్మిత సాలిడ్ ప్రొపెల్లెంట్‌లతో కూడిన ఖండాంతర బాలిస్టిక్ క్షిపణిని తరలించడానికి, దాచడానికి, ప్రయోగించడానికి సులభంగా ఉంటుంది. ప్రత్యర్థులు దీన్ని అంత సులువుగా గుర్తించలేరు.

More Telugu News