Gujarat Titans: ఈ మ్యాచ్ లోనూ ఉత్కంఠే... మరో బంతి మిగిలుండగా టైటాన్స్ విజయం

  • ఆఖరి ఓవర్ వరకు జరిగిన పంజాబ్, గుజరాత్ టైటాన్స్ మ్యాచ్
  • 154 రన్స్ టార్గెట్ ను 19.5 ఓవర్లలో ఛేదించిన టైటాన్స్
  • 67 పరుగులు చేసిన  శుభ్ మాన్ గిల్
  • ఆఖర్లో విన్నింగ్ షాట్ కొట్టిన తెవాటియా 
Gujarat Titans win by 6 wickets in the last over thriller against Punjab Kings

ఐపీఎల్ లో ఇటీవల మ్యాచ్ లన్నీ చివరి ఓవర్ వరకు నరాలు తెగే ఉత్కంఠగా సాగుతున్నాయి. తాజాగా, గుజరాత్ టైటాన్స్, పంజాబ్ కింగ్స్ మధ్య మ్యాచ్ కూడా చివరి ఓవర్ వరకు సాగింది. 154 పరుగుల విజయలక్ష్యాన్ని గుజరాత్ టైటాన్స్ మరో బంతి మిగిలుండగా ఛేదించింది. ఈ క్రమంలో టైటాన్స్ 4 వికెట్లు కోల్పోయింది. యువ ఓపెనర్ శుభ్ మాన్ గిల్ కీలక ఇన్నింగ్స్ ఆడాడు. గిల్ 49 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్స్ తో 67 పరుగులు చేశాడు. 

ఆఖరి ఓవర్లో టైటాన్స్ విజయానికి 7 పరుగులు అవసరం కాగా... గిల్ ను శామ్ కరన్ అవుట్ చేయడంతో ఉత్కంఠ నెలకొంది. అయితే తెవాటియా బౌండరీ కొట్టి మ్యాచ్ ను ముగించాడు. దాంతో, టైటాన్స్ శిబిరంలో విజయోత్సాహాలు నెలకొన్నాయి. 

టైటాన్స్ లక్ష్యఛేదన ఆరంభంలో, ఓపెనర్ వృద్ధిమాన్ సాహా 19 బంతుల్లో 5 ఫోర్లతో చకచకా 30 పరుగులు సాధించాడు. సాయి సుదర్శన్ 19, కెప్టెన్ హార్దిక్ పాండ్యా 8 పరుగులకు అవుటయ్యారు. గిల్ కు జోడీ డేవిడ్ మిల్లర్ 15 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. పంజాబ్ కింగ్స్ బౌలర్లలో అర్షదీప్ సింగ్ 1, కగిసో రబాడా 1, హర్ ప్రీత్ బ్రార్ 1 వికెట్ తీశారు. 

ఈ మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకోగా, పంజాబ్ కింగ్స్ బ్యాటింగ్ కు దిగింది. టైటాన్స్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో పంజాబ్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 153 పరుగులు చేసింది.

More Telugu News