Gas cylinder blast: కుట్ర కోణం ఉందో, లేదో దర్యాప్తులో తేలుతుంది.. చీమలపాడు అగ్నిప్రమాద ఘటనపై కేటీఆర్

  • ఖమ్మం జిల్లా చీమలపాడులో నిన్న జరిగిన ప్రమాదంలో ముగ్గురి మ‌ృతి
  • గాయపడ్డ నలుగురికి హైదరాబాద్ లోని నిమ్స్‌లో చికిత్స
  • బాధితులను పరామర్శించిన మంత్రి కేటీఆర్‌
  • కార్యకర్తలకు తాము అండగా ఉంటామని భరోసా 
minister ktr visits cheemalapadu cylinder blast victims in nims

ఖమ్మం జిల్లా చీమలపాడులో నిన్న జరిగిన అగ్ని ప్రమాదంలో ముగ్గురు చనిపోగా, పలువురు తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే. నలుగురు బాధితులు హైదరాబాద్‌లోని నిమ్స్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరిని బీఆర్‌ఎస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడు, తెలంగాణ మంత్రి కేటీఆర్‌ ఈ రోజు పరామర్శించారు. 

గురువారం ఉదయం మంత్రి పువ్వాడ అజయ్‌, ఎంపీలు నామా నాగేశ్వరరావు, వద్దిరాజు రవిచంద్రతో కలిసి నిమ్స్ కు వెళ్లిన కేటీఆర్.. బాధితుల ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. వారి పరిస్థితి నిలకడగానే ఉందని డాక్టర్లు కేటీఆర్‌కు తెలిపారు. బాధితులకు మెరుగైన వైద్యసాయం అందించాలని వైద్యులకు ఆయన సూచించారు.

తర్వాత మీడియాతో మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ.. ‘‘చీమలపాడు ఘటన దురదృష్టకరం. ప్రమాదంలో కుట్ర కోణం ఉందో, లేదో దర్యాప్తులో తేలుతుంది. ఇప్పటికే మృతుల కుటుంబాలకు రూ.10 లక్షలు ఎక్స్‌గ్రేషియా ప్రకటించాం. గాయపడిన వారికి మెరుగైన వైద్యసేవలు అందించాలని వైదులను కోరాం’’ అని తెలిపారు. బీఆర్‌ఎస్‌ పార్టీ కార్యకర్తలకు తాము అండగా ఉంటామని చెప్పారు. 

ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం చీమలపాడులో బుధవారం నిర్వహించిన బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో ప్రమాదం చోటుచేసుకుంది. ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు, ఎమ్మెల్యే రాములు నాయక్ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. పూలు చల్లుకుంటూ, డప్పులు కొట్టుకుంటూ, పటాసులు పేల్చుతూ వారికి బీఆర్ఎస్ నాయకులు స్వాగతం పలికారు. పటాసులు కాల్చడంతో నిప్పురవ్వలు దగ్గర్లో ఉన్న గుడిసె మీద పడ్డాయి. మంటలను ఆర్పుతుండగా గుడిసెలోని గ్యాస్‌ సిలిండర్‌ పేలడంతో ముగ్గురు వ్యక్తులు తీవ్రంగా గాయపడి చనిపోయారు. కొందరి కాళ్లు నుజ్జునుజ్జు అయ్యాయి.

More Telugu News