Chandrababu: జగన్‌ మీ బిడ్డ కాదు.. క్యాన్సర్‌ గడ్డ: చంద్రబాబు మండిపాటు

chandra babu fires on ys jagan
  • విజయవాడ తూర్పు నియోజకవర్గంలో పర్యటించిన చంద్రబాబు
  • జగన్ క్యాన్సర్‌ లాంటివాడని, ప్రజలను పట్టిపీడిస్తున్నాడని విమర్శ
  • రాష్ట్రం నుంచి సైకో పోకపోతే.. మనమే పోయే పరిస్థితి ఉందని వ్యాఖ్య
  • జగనే నమ్మకం కాదు.. రాష్ట్రానికి పట్టిన దరిద్రమని ఆగ్రహం
  • ప్రజలకు ఇచ్చేది పది.. గుంజేది వంద అని ఎద్దేవా
ఏపీ సీఎం వైఎస్ జగన్ పై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. సమాజానికి క్యాన్సర్‌ లాంటివాడు జగన్‌ అని విమర్శించారు. ‘‘జగన్‌ మీ బిడ్డ కాదు.. క్యాన్సర్‌ గడ్డ. ప్రజలను పట్టి పీడిస్తున్నాడు’’ అని నిప్పులుచెరిగారు. ఈ రోజు విజయవాడ తూర్పు నియోజకవర్గంలో చంద్రబాబు పర్యటించారు. ఈ సందర్భంగా ఆయనకు కార్యకర్తలు, నాయకులు ఘన స్వాగతం పలికారు. పలువురు వైసీపీ నాయకులు పార్టీలో చేరారు. అనంతరం కార్యకర్తలను ఉద్దేశించి చంద్రబాబు మాట్లాడారు. 

‘‘చివరి సంవత్సరం.. ఇంకొన్ని నెలలే.. సైకో పోవడం ఖాయం. రాష్ట్రం నుంచి సైకో పోకపోతే.. మనమే రాష్ట్రం వదిలి పోయే పరిస్థితి నెలకొంది’’ అని చంద్రబాబు అన్నారు. ‘‘ఇల్లు మీది.. స్టిక్కర్ సైకోది. మధ్యలో సైకో పెత్తనం ఏంటి? ఇంటి యజమాని అనుమతి లేకుండా ఇంటికి స్టిక్కర్లు అతికించడం అనైతికం. చట్ట వ్యతిరేకం’’ అని చెప్పారు.

వాలంటీర్లకు ఇచ్చేది ప్రజాధనం కాదా? అని చంద్రబాబు ప్రశ్నించారు. జగన్ తాత ముత్తాతల సొమ్ము తెచ్చి ఇస్తున్నారా? అని నిలదీశారు. ‘‘నంగి నంగిగా మాట్లాడతాడు. జగనే భవిష్యత్ అంట.. జగనే మా నమ్మకం అంట. జగనే నమ్మకం కాదు.. జగనే మన రాష్ట్రానికి పట్టిన దరిద్రం. జగన్ పోతేనే పిల్లల భవిష్యత్తు.. రాష్ట్ర భవిష్యత్తు. జగన్ ఉంటే రాష్ట్రం అంధకారమే’’ అని అన్నారు.  

‘‘బాబాయ్ గురించి ఏం చెప్పాలి. బాబాయ్ ని అనునిత్యం చంపేస్తున్నారు. మొదటి రోజు గుండెపోటు.. తర్వాత రక్తపోటు. ఆ తర్వాత.. గొడ్డలితో చంపి నా పేరు పెట్టాలనుకుంటున్నారంటే ఏం దొంగలు. వాళ్లు కరుడుగట్టిన నేరస్థులు, ఆర్థిక ఉగ్రవాదులు’’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

‘‘నిత్యావసర ధరలు పెరిగాయి. కరెంటు చార్జీలు పెంచారు. ఇచ్చేది పది.. గుంజేది వంద. బయటి రాష్ట్రాల ప్రజలు ఏపీ పరిస్థితి చూసి జాలి పడుతున్నారు’’ అని చంద్రబాబు విమర్శించారు.
Chandrababu
Jagan
TDP
YSRCP
Vijayawada

More Telugu News