Harish Rao: మీకెన్ని బొక్కలు ఉన్నాయో.. మీ రాష్ట్రాన్ని ఎలా తగలేశారో.. మీ ప్రతిపక్షాలే చెబుతున్నాయ్!: హరీశ్ రావుపై ఏపీ మంత్రి కారుమూరి మండిపాటు

  • ఏపీలో పాలనపై హరీశ్ రావు చేసిన వ్యాఖ్యలపై రగడ
  • హరీశ్ వస్తే అభివృద్ధిని చూపిస్తామన్న కారుమూరి నాగేశ్వరరావు
  • ఒక్క వర్షానికే హైదరాబాద్ మునిగిపోతుందని ఎద్దేవా
  • ముందు అక్కడి ప్రతిపక్షాలకు సమాధానాలు చెప్పాలని కౌంటర్
ap minister karumuri counters on telangana minister harish rao

ఆంధ్రప్రదేశ్‌లో పాలనపై తెలంగాణ మంత్రి హరీశ్ రావు చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ఏపీలో పరిస్థితులకి, తెలంగాణలో పాలనకి జమీన్ ఆస్మాన్ ఫరక్ (భూమికి ఆకాశానికి ఉన్నంత తేడా) ఉందని ఆయన చేసిన వ్యాఖ్యలపై ఏపీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు తీవ్రంగా మండిపడ్డారు. హరీశ్ రావు దౌర్భాగ్యపు మాటలు మానుకోవాలని సూచించారు.
 
హరీశ్ రావు ఏపీకి వస్తే ఇక్కడ జరుగుతున్న అభివృద్ధిని చూపిస్తామని కారుమూరి చెప్పారు. ‘‘ఒక్క వర్షం కురిసిందంటే చాలు హైదరాబాద్ మునిగిపోతుంది. హైదరాబాద్ లో ఇళ్ల మీది నుంచి నీళ్లు పోతున్నాయి. మీరేం చేశారు? హైదరాబాద్ పరిస్థితిని ఘోరంగా చేసింది మీరు’’ అని విమర్శించారు. 

అన్ని సౌకర్యాలతో వచ్చిన తెలంగాణ రాష్ట్రాన్ని ఎలా తగలేసుకున్నారో ప్రజలు, ప్రతిపక్షాలే చెబుతున్నాయన్నారు. ‘‘మీకెన్ని బొక్కలు ఉన్నాయో, ఎన్ని లొసుగులు ఉన్నాయో.. రాష్ట్రాన్ని మీరు ఎంత తగలేశారో.. మీ ప్రతిపక్షాలే చెబుతున్నాయ్. వాళ్లకు సమాధానాలు చెప్పుకోండి’’ అంటూ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు కౌంటర్ ఇచ్చారు. 

ఏపీలో రోడ్లు సరిగా లేవన్న హరీశ్ వ్యాఖ్యలను మంత్రి ఖండించారు. ‘‘హైదరాబాద్ లో మాత్రమే రోడ్లు వేస్తే అయిపోయిందా? మా రాష్ట్రంలో ఏం జరుగుతోంది? మా ప్రజలకు ఎన్ని సదుపాయాలు అందుతున్నాయో వచ్చి చూడండి. మీరు ఓట్లు వేసే వాళ్లకే సేవ చేస్తున్నారేమో.. ఓట్లు వేయని చిన్నారులకు కూడా మా జగన్ సేవలు చేస్తున్నారు’’ అని చెప్పుకొచ్చారు. చదువుల్లో ఏపీ 14 వ స్థానంలో ఉండేదని.. ఇప్పుడు 3వ స్థానానికి వచ్చిందంటే ఇది జగన్ క‌ృషేనని మంత్రి కారుమూరి అన్నారు.

More Telugu News