Telangana: సహకార చక్కెర కర్మాగారాల తరహాలో నిజాం షుగర్స్ పునరుద్ధరిస్తాం: కేటీఆర్

  • ఫ్యాక్టరీ పునరుద్ధరణకు బీఆర్ఎస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టీకరణ
  • ఇప్పటికే సిర్పూర్ పేపర్ మిల్లును పున:ప్రారంభించిందన్న మంత్రి
  • రేయాన్స్ ఫ్యాక్టరీ పునరుద్ధరణ కోసం ఐటీసీతో చర్చలు జరుగుతున్నాయని వెల్లడి
Government commined to revive Nizam Sugar Factory says KTR

తెలంగాణలో ఎంతో ఘన చరిత్ర ఉన్న నిజాం షుగర్ ఫ్యాక్టరీ పునరుద్ధరణకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ పునరుద్ఘాటించారు. ఇదే విషయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ఇదివరకే అసెంబ్లీలో తెలిపారన్నారు. చక్కెర కర్మాగారాల పనితీరును అధ్యయనం చేయడానికి అప్పటి వ్యవసాయ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి నేతృత్వంలోని బృందం మహారాష్ట్రలో పర్యటించిందని గుర్తు చేశారు. మహారాష్ట్రలో రైతులు చేస్తున్న విధంగా సహకార చక్కెర కర్మాగారాల తరహాలో ఫ్యాక్టరీని నిర్వహించే ఆలోచనతో ప్రభుత్వం ఉన్నట్టు కేటీఆర్ చెప్పారు. తమ ప్రభుత్వం ఇప్పటికే సిర్పూర్ పేపర్ మిల్లును పునరుద్ధరించిందన్నారు.  

ఉమ్మడి వరంగల్ జిల్లాలోని రేయాన్స్ ఫ్యాక్టరీని (బిల్ట్) పునరుద్ధరించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపారు. దీనికి సంబంధించి ఐటీసీతో చర్చలు జరుగుతున్నాయన్నారు. కేంద్ర ప్రభుత్వం చేస్తున్నట్టుగా రాష్ట్ర ప్రభుత్వం ఈ ఫ్యాక్టరీలను విక్రయించే అవకాశం ఉన్నప్పటికీ బీఆర్ఎస్ కు అలాంటి ఆలోచన లేదని కేటీఆర్ స్పష్టం చేశారు. వాటిని తాము ఉపాధి కల్పించే యూనిట్లుగా, ప్రభుత్వానికి ఆదాయ వనరులు, ఆస్తులుగానే పరిగణిస్తున్నామని, అంతే తప్ప రియల్ ఎస్టేట్ ఆస్తిగా చూడటం లేదని తెలిపారు.

More Telugu News