TDP: టీడీపీ ప్రధాన కార్యదర్శికి సీఐడీ నోటీసులు!

  • మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయానికి వచ్చిన సీఐడీ అధికారులు
  • అక్కడున్న లాయర్ చేతికి నోటీసుల అందజేత
  • గతేడాది టీడీపీ పత్రికలో వచ్చిన ఓ కథనంపై నోటీసులు!
  • 2022 నవంబరు 23న చైతన్యరథం పత్రికలో బుగ్గనపై కథనం
CID officials at TDP Head Office in Mangalagiri

ఏపీ సీఐడీ అధికారులు మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయానికి వచ్చారు. టీడీపీ ప్రధాన కార్యదర్శిని ఉద్దేశించి నోటీసులు ఇచ్చారు. అక్కడున్న లాయర్ చేతికి నోటీసులు అందించారు. టీడీపీ అనుబంధ పత్రిక చైతన్యరథంలో వచ్చిన కథనాలపై సీఐడీ అధికారులు వివరాలు సేకరించారు. పత్రిక ఎడిటర్ ఎవరు? పత్రిక నిర్వహణ ఎవరు చూస్తున్నారు? అంటూ ప్రశ్నించారు. 

కాగా, తిరుపతికి చెందిన సీఐడీ అధికారులు 91 సీఆర్పీసీ కింద నోటీసులు ఇచ్చినట్టు తెలుస్తోంది. గతేడాది నవంబరు 23న చైతన్యరథం పత్రికలో వచ్చిన ఓ కథనంపై సీఐడీ అధికారులు నోటీసులతో వచ్చినట్టు సమాచారం. 

దీనిపై టీడీపీ సీనియర్ నేత, మాజీమంత్రి జవహర్ స్పందించారు. కేవలం కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే ఇవాళ సీఐడీ అధికారులు నోటీసులు ఇవ్వడానికి వచ్చారని విమర్శించారు. సాక్షి పేపర్లో నారాసుర రక్తచరిత్ర అని రాసినప్పుడు నోటీసులు ఇచ్చారా? అని ప్రశ్నించారు. ఆరోజు చైతన్యరథంలో బుగ్గనపై వచ్చిన ఆరోపణలకు ఇప్పటికీ కట్టుబడి ఉన్నామని జవహర్ స్పష్టం చేశారు. 

ఇలాంటి విషయాల్లో కేసులు పెట్టాల్సి వస్తే మొదట సాక్షి పత్రికపైనే పెట్టాలని అన్నారు. రాజకీయ లబ్ది కోసమే ఇలాంటి చర్యలకు దిగుతున్నారని మండిపడ్డారు. ఆ నోటీసులపై ప్రధాన కార్యదర్శి అని ఉందని, జాతీయ ప్రధాన కార్యదర్శా, లేక రాష్ట్ర ప్రధాన కార్యదర్శా, పత్రిక ఎడిటర్ ఎవరు అనే కనీస పరిజ్ఞానం లేకుండా వచ్చారని జవహర్ విమర్శించారు. పత్రికలో కథనం ఎప్పుడో వస్తే, ఇప్పుడు వచ్చి నోటీసులు ఇవ్వడం టీడీపీని దెబ్బతీసే ప్రయత్నంలో భాగమేనని అన్నారు.

More Telugu News