Number Plate: ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన నెంబరు ప్లేట్ ఇదే!

This is the most expensive number plate
  • పీ-7 నెంబర్ ప్లేట్ వేలం
  • వేలంలో రూ.123 కోట్ల ధర
  • దక్కించుకున్న అరబ్ సంపన్నుడు
  • దుబాయ్ పాలకుడి భోజన వితరణ కార్యక్రమానికి వేలం నిధులు
వాహనాలకు ఉపయోగించే సాధారణ రిజిస్ట్రేషన్ నెంబర్లతో పోల్చితే ఫ్యాన్సీ నెంబర్లు అధిక ధర పలుకుతుంటాయి. కొన్ని ఫ్యాన్సీ నెంబర్ల కోసం వేలం పాట కూడా నిర్వహిస్తారు. భారత్ లో ఇలాంటి వేలం పాటల్లో సినీ ప్రముఖులు, రాజకీయనేతలు, వ్యాపారవేత్తలు పాల్గొని లక్షల రూపాయలు వెచ్చించి తమ లక్కీ నెంబర్లను దక్కించుకుంటారు.

ఇక, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లో ఓ చారిటీ కోసం నెంబర్ ప్లేట్ల వేలం నిర్వహించగా, పీ-7 అనే నెంబరు కలిగిన ప్లేట్ ప్రపంచంలోనే అత్యధిక ధర పలికింది. ఓ అరబ్ సంపన్నుడు ఈ నెంబరు ప్లేట్ ను రూ.123 కోట్లకు దక్కించుకున్నాడు. 

ఈ వేలంలో వచ్చిన సొమ్మును దుబాయ్ పాలకుడు షేక్ మహ్మద్ బిన్ రషీద్ కు చెందిన ప్రపంచ భోజన పథకం (100 కోట్ల భోజనాల వితరణ) కోసం ఖర్చు చేస్తారు. కుబేరులు అనదగ్గ అరబ్ సంపన్నులు ఉపయోగించిన వాహనాల నెంబర్ ప్లేట్లను వేలం వేయడం యూఏఈలో ఆనవాయతీ. 

2008లో 1 అనే ఒకే ఒక నెంబరు ఉన్న ప్లేట్ ను వేలం వేయగా రూ.116 కోట్లకు అమ్ముడుపోయింది. స్థానిక వ్యాపారి సయీద్ అబ్దుల్ గఫార్ ఖౌరి దీన్ని కొనుగోలు చేశాడు. ఇప్పుడా రికార్డు పీ-7 నెంబర్ ప్లేట్ వేలంతో తెరమరుగైంది.
Number Plate
Expensive
UAE
Auction

More Telugu News