Hyderabad: శంషాబాద్ ఎయిర్‌పోర్టులో చివరి నిమిషంలో ఎయిర్ ఇండియా విమానాల రద్దు.. ప్రయాణికుల ఆగ్రహం!

Air India cancelled several flights at the last minute in Shamshabad
  • ఎయిర్‌పోర్టుకు చేరుకున్న ప్రయాణికులకు షాక్
  • హైదరాబాద్ నుంచి బయలుదేరాల్సిన పలు సర్వీసులు రద్దయినట్టు ఎయిర్ ఇండియా ప్రకటన
  • రద్దు విషయం ముందస్తుగా చెప్పలేదంటూ ప్రయాణికుల ఆగ్రహం
  • టిక్కెట్ డబ్బులు రిఫండ్ ఇస్తామనడంతో శాంతించిన కస్టమర్లు
శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఒకేసారి పలు విమానాలు రద్దు కావడం ప్రయాణికులను తీవ్ర ఆగ్రహానికి గురిచేసింది. హైదరాబాద్ నుంచి బయలుదేరాల్సిన విమానాలతో పాటూ ఇక్కడకు రావాల్సిన వాటిని కూడా ఎయిర్ ఇండియా రద్దు చేసింది. ఆపరేషనల్ సమస్యల కారణంగా చెబుతూ సర్వీసులను రద్దు చేసింది. హైదరాబాద్ నుంచి తిరుపతి, బెంగళూరు, వైజాగ్, మైసూరు వెళ్లే విమానాలు రద్దయ్యాయి. అలాగే చెన్నై, తిరుపతి, బెంగళూరు, మైసూరు నుంచి హైదరాబాద్‌కు రావాల్సిన విమాన సర్వీసులను కూడా క్యాన్సిల్ చేస్తున్నట్టు ప్రకటించింది. 

రద్దు విషయంలో తమకు ముందస్తుగా సమాచారం ఇవ్వలేదని ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎయిర్‌పోర్టుకు వచ్చాక సర్వీసులు రద్దయినట్టు తమకు తెలిసిందని 48 మంది ప్రయాణికులు మండిపడ్డారు. ఈ క్రమంలో సిబ్బంది, ప్రయాణికుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. తమ సమయం వృథా అయ్యిందంటూ ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే, టిక్కెట్ డబ్బులు రిఫండ్ చేస్తామని అధికారులు చెప్పడంతో వారు శాంతించారు. చివరకు నిరాశతో వెనుదిరిగారు. 
Hyderabad
Rajiv Gandhi International Airport

More Telugu News