Helmet Man: ఇల్లు అమ్మి మరీ వాహనదారులకు ఉచితంగా హెల్మెట్ల పంపిణీ

Helmet Man of India sold house to distribute free helmets
  • బీహార్ రాష్ట్రానికి చెందిన ఓ వ్యక్తి వినూత్నమైన సేవ
  • యుమునా ఎక్స్ ప్రెస్ వేపై ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్లు
  • ప్రాణం విలువ తెలియజేసే ప్రయత్నం

ఒక్క సంఘటన కొందరిని ఎంతో ప్రభావితం చేస్తుంది. జీవితంలో ఊహించని నిర్ణయాలకు దారితీస్తుంది. అలాంటిదే ఈ కేసు కూడా. ఆగ్రా-లక్నో ఎక్స్ ప్రెస్ వేపై హెల్మెట్ లేకుండా ఎవరైనా వాహనదారుడు వెళ్లే ప్రయత్నం చేస్తే.. దారి మధ్యలో ఓ వ్యక్తి వారి వాహనానికి బ్రేకులు పడేలా చేస్తాడు. వాహనదారుడి చేతికి ఓ హెల్మెట్ ఉచితంగా ఇచ్చి, విష్ యు ఆల్ ద బెస్ట్ అని పంపిస్తాడు. అతడి పేరు రాఘవేంద్ర కుమార్. అతడి స్వరాష్ట్రం బీహార్. రాఘవేంద్ర నిస్వార్థ సేవ వెనుక ఓ బలమైన కారణం ఉంది.

ఓ రోజు అతడి స్నేహితుడు వాహనంపై వెళుతూ ప్రమాదానికి గురై మరణించాడు. యుమునా ఎక్స్ ప్రెస్ వేపై ఓ ట్యాంకర్ అతడి స్నేహితుడి వాహనాన్ని ఢీకొంది. ఆ సమయంలో తలకు హెల్మెట్ లేకపోవడం వల్లే రాఘవేంద్ర స్నేహితుడు ప్రాణాలు విడవాల్సి వచ్చింది. ఆదే రాఘవేంద్రలో మార్పునకు కారణమైంది. తన స్నేహితుడి మాదిరి పరిస్థితిని మరొకరు ఎదుర్కోకూడదన్న సదుద్దేశ్యంతో తొమ్మిదేళ్ల క్రితం రాఘవేంద్ర ఈ ఉచిత హెల్మెట్ల పంపిణీని మొదలు పెట్టాడు. 

ఇప్పటి వరకు అతడు 56,000 హెల్మెట్లను, అది కూడా బీఐఎస్ మార్క్ ఉన్న నాణ్యమైనవి పంపిణీ చేశాడు. ఈ సేవ పట్ల అతడు ఎంత పిచ్చిగా ఉన్నాడంటే.. గ్రేటర్ నోయిడాలోని తన ఫ్లాట్ ను విక్రయించడమే కాదు, తన భార్య ఆభరణాలను కుదువపెట్టి రుణం తీసుకుని మరీ ఉచిత హెల్మెట్ కార్యక్రమాన్నికొనసాగిస్తున్నాడు. కేంద్ర రవాణా మంత్రి గడ్కరీ, ప్రముఖ నటుడు సోనూసూద్ సైతం రాఘవేంద్ర కుమార్ సేవలను ప్రశంసించారు. రాఘవేంద్రను హెల్మెట్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని కూడా పిలుస్తుంటారు.

  • Loading...

More Telugu News