pm modi: బందీపూర్ పార్క్ లో మోదీ సఫారీ.. వీడియో ఇదిగో!

  • ప్రాజెక్ట్ టైగర్ కు 50 పూర్తయిన సందర్భంగా 20 కిలోమీటర్లు సఫారీ 
  • ప్రత్యేక నాణాన్ని విడుదల చేయనున్న ప్రధాని మోదీ
  • తమిళనాడులోని మదుమలై టైగర్ రిజర్వ్ సందర్శన
PM Modi safari in bandipore tiger reserve in karnataka

దక్షిణాది రాష్ట్రాల పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం ఉదయం కర్ణాటకలోని బందీపూర్ కు చేరుకున్నారు. టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ లో ప్రధాని జంగిల్ సఫారీ చేశారు. దాదాపు 20 నిమిషాలపాటు జీపులో పార్క్ లోపల తిరిగారు. ‘ప్రాజెక్ట్ టైగర్’ కు 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా చేపట్టిన పలు కార్యక్రమాలలో మోదీ జంగిల్ సఫారీ కూడా ఒకటని బందీపూర్ నేషనల్ పార్క్ అధికారులు తెలిపారు. ఈ సఫారీ కోసం మోదీ ప్రత్యేకంగా తయారయ్యారు. పార్క్ లోపల పులుల నివాసాలను, వాటికి దాహార్తిని తీర్చేందుకు ఏర్పాటు చేసిన సదుపాయాలతో పాటు ఏనుగుల క్యాంప్ లను చూపించినట్లు అధికారులు వివరించారు. దాదాపు 20 నిమిషాల పాటు ప్రధాని మోదీ సఫారీ కొనసాగిందని వివరించారు.

బందీపూర్ రిజర్వ్ ఫారెస్ట్ లో సఫారీ పూర్తయిన తర్వాత మైసూరులో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రధాని మోదీ పాల్గొంటారు. ప్రాజెక్ట్ టైగర్ 50 వసంతాల స్మారక నాణాన్ని విడుదల చేస్తారు. దేశంలోని పులుల గణనకు సంబంధించిన వివరాలను విడుదల చేస్తారు. అనంతరం తమిళనాడులోని మదుమలై టైగర్ రిజర్వ్ కు ప్రధాని మోదీ చేరుకుంటారు. అందులోని తెప్పకాడు ఎలిఫెంట్ క్యాంప్ ను ప్రధాని సందర్శిస్తారు. ఆస్కార్ అవార్డు పొందిన డాక్యుమెంటరీ ‘ది ఎలిఫెంట్  విస్పరర్’ ను చిత్రీకరించింది ఈ క్యాంపులోనేనని అధికారులు తెలిపారు. అదేవిధంగా ఈ డాక్యుమెంటరీలో నటించిన బొమ్మన్, వల్లిలతో పాటు రఘు (ఏనుగు) ను మోదీ కలుసుకుంటారని అధికారులు వివరించారు.

More Telugu News