Corona Virus: గర్భంలో ఉండగా కొవిడ్ సోకిన ఇద్దరు చిన్నారుల్లో దెబ్బతిన్న మెదడు!

  • గుర్తించిన మియామి యూనివర్సిటీ పరిశోధకులు
  • తల్లి మాయ నుంచి గర్భస్థ శిశువులకు సోకిన కరోనా
  • చిన్నారుల రక్తంలో కొవిడ్ యాంటీబాడీల గుర్తింపు
  • గర్భిణులు తప్పనిసరిగా కరోనా వ్యాక్సిన్ తీసుకోవాలంటున్న శాస్త్రవేత్తలు
COVID Caused Brain Damage In 2 Babies

కరోనా కేసులకు సంబంధించి విస్తుపోయే ఘటన ఒకటి వెలుగు చూసింది. గర్భంలో ఉండగానే కొవిడ్ సోకిన ఇద్దరు చిన్నారుల్లో మెదడు దెబ్బతిన్నట్టు తాజాగా బయటపడింది.  ఇలాంటి కేసులు బయటపడడం ఇదే తొలిసారని అమెరికా వైద్యులు తెలిపారు. మియామి యూనివర్సిటీ అధ్యయనంలో తేలిన ఈ విషయానికి సంబంధించిన పరిశోధన కథనం ‘పీడియాట్రిక్స్ జర్నల్’లో ప్రచురితమైంది. 

2020లో డెల్టా వేరియంట్ విరుచుకుపడి, టీకాలు అందుబాటులో  రావడానికి ముందే ఈ ఘటన జరిగింది. కరోనా పాజిటివ్‌గా తేలిన ఇద్దరు తల్లులకు వీరు జన్మించారు. జన్మించిన తొలి రోజునే శిశువులు ఇద్దరూ మూర్ఛవ్యాధికి గురయ్యారు. ఆ తర్వాత వారి ఎదుగుదల కూడా ఆలస్యమైంది. ఆ తర్వాత 13 నెలల వయసులో ఓ శిశువు చనిపోయింది. దీంతో మరో చిన్నారిని వెంటనే హాస్పైస్ కేర్‌కు తరలించి చికిత్స అందించారు. 

పిల్లల్లో ఎవరికీ కరోనా సోకినట్టు పరీక్షల్లో నిర్ధారణ కాలేదు. అయితే, వారి రక్తంలో మాత్రం కొవిడ్ యాంటీబాడీలు అధిక స్థాయిలో ఉన్నట్టు మియామి యూనివర్సిటీ నియోనాటాలజిస్ట్, పీడియాట్రిక్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ మెర్లైన్ బెన్నీ తెలిపారు. వైరస్ తొలుత తల్లి నుంచి మాయకు, ఆ తర్వాత గర్భస్థ శిశువుకు చేరినట్టు ఇది సూచిస్తోందన్నారు. తల్లులు ఇద్దరి మాయలోనూ వైరస్ ఉన్నట్టు పరిశోధకులు గుర్తించారు. చనిపోయిన పిల్లల మెదడు శవపరీక్షలో మెదడులో వైరస్ జాడలు కూడా కనిపించాయని, ఈ ఇన్ఫెక్షన్ నేరుగా మెదడు గాయానికి కారణమైనట్టు డాక్టర్ బెన్నీ వివరించారు. 

తల్లులు ఇద్దరికీ కరోనా వైరస్ పాజిటివ్ అనే తేలినప్పటికీ ఒకరిలో కొద్దిపాటి లక్షణాలు మాత్రమే ఉండగా ఆమె పూర్తి నెలలు నిండిన తర్వాత బిడ్డకు జన్మనిచ్చింది. లక్షణాలు తీవ్రంగా ఉన్న మహిళ 32 వారాలకే ప్రసవించింది. కాబట్టి గర్భంతో ఉన్న మహిళలు తప్పనిసరిగా వ్యాక్సిన్ తీసుకోవాలని శాస్త్రవేత్తలు సూచించారు. కాగా, గర్భధారణ సమయంలో పిల్లల మెదడులో అయిన గాయాలు డెల్టా వేరియంట్ కారణంగా సంభవించినవా? లేదంటే ఒమిక్రాన్ వేరియంట్‌ కారణంగా సంభవించినవా? అన్న విషయంలో స్పష్టత లేదు.

More Telugu News