Uttar Pradesh: వాళ్ల ప్యాంట్లు తడిసిపోతున్నాయి: సీఎం యోగి ఆదిత్య నాథ్

UP CM Yogi adithya nath says gangsters are at their wits end
  • కోర్టు తీర్పులతో గ్యాంగ్‌స్టర్ల ప్యాంట్లు తడిసిపోతున్నాయన్న సీఎం యోగి
  • చట్టాన్ని ధిక్కరించిన వారు భయంతో పరుగులు తీస్తున్నారని వ్యాఖ్య
  • గోరఖ్‌పూర్‌లో ఓ ప్లాంట్ భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం
కోర్టు తీర్పులతో గ్యాంగ్‌స్టర్లకు ప్యాంట్లు తడిసిపోతున్నాయని ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆతిత్యనాథ్ తాజాగా వ్యాఖ్యానించారు. గోరఖ్‌పూర్ జిల్లాలో ఆయన శనివారం ఓ బాట్లింగ్ ప్లాంట్ భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా యూపీలో లా అండ్ ఆర్డర్ పరిస్థితిపై పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఒకప్పుడు యథేచ్ఛగా చట్టాన్ని ఉల్లంఘిస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేసిన గ్యాంగ్‌స్టర్లు, రౌడీలు ఇప్పుడు భయపడిపోతున్నారని వ్యాఖ్యానించారు. కోర్టుల్లో తమకు వ్యతిరేకంగా వస్తున్న తీర్పులు చూసి వారి ప్యాంట్లు తడిసిపోతున్నాయని కామెంట్ చేశారు. ఈ విషయాన్ని ప్రజలు కూడా గమనిస్తున్నారని చెప్పుకొచ్చారు. 

‘‘ఒకప్పుడు ఈ మాఫియా వాళ్లు రెచ్చిపోయారు. చట్టం అంటే లెక్కలేకుండా ఇండస్ట్రియలిస్టులు, వ్యాపారవేత్తలపై బెదిరింపులకు దిగుతూ డబ్బులు గుంజేవారు. కానీ.. కోర్టుల్లో ఇటీవల వారికి వ్యతిరేకంగా తీర్పులు వెలువడుతున్నాయి. దీంతో.. ఆ దుండగులకు ఏం చేయాలో పాలుపోవట్లేదు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పారిపోతున్నారు’’ అని ఆయన వ్యాఖ్యానించారు. 

2006 నాటి ఉమేశ్‌పాల్ కిడ్నాప్ కేసులో ప్రముఖ నేత ఆతిక్ అహ్మద్‌తో పాటూ మరో ఇద్దరిని స్థానిక కోర్టు దోషిగా తేల్చింది. అహ్మద్‌పై ఇప్పటివరకూ 100కు పైగా కేసులున్నా అతడిని దోషిగా తేల్చడం ఇదే తొలిసారి. ఈ నేపథ్యంలో సీఎం యోగి వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
Uttar Pradesh
Yogi Adityanath

More Telugu News