Bopparaju Venkateswarlu: జీతాలు అడిగితే హేళన చేస్తారా?: బొప్పరాజు

  • మరోసారి ఉద్యమ బాటపట్టిన ఏపీ ఉద్యోగ సంఘాలు
  • విజయవాడలో నల్ల కండువాలు, ప్లకార్డులతో ఉద్యోగుల ఆందోళన
  • పాల్గొన్న ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు
  • ఏపీ సర్కారు ఉద్యోగులను పట్టించుకోవడంలేదని విమర్శలు
  • తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరిక
Bopparaju fires on AP Govt

డిమాండ్ల సాధన కోసం ఉద్యమ బాట పట్టిన ఏపీ ఉద్యోగ సంఘాలు మరోసారి ఆందోళనలు చేపట్టాయి. ఏపీజేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో విజయవాడలో ప్లకార్డులు, నల్లకండువాలతో ప్రదర్శన చేపట్టారు. ఈ సందర్భంగా బొప్పరాజు మీడియాతో మాట్లాడారు. 

ఏపీ సర్కారు ప్రభుత్వ ఉద్యోగులను పట్టించుకోవడంలేదని అన్నారు. సమయానికి జీతాలు కూడా ఇవ్వలేని స్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉందని విమర్శించారు. వేతన స్కేలు, డీఏ బకాయిలు, పీఆర్సీ, జీతాలు ఇవ్వాలని ఉద్యోగులు అడుగుతుంటే అవహేళన చేసే పరిస్థితి నెలకొందని బొప్పరాజు ఆవేదన వ్యక్తం చేశారు. 

సమస్యల పరిష్కారం అటుంచి, లెక్కలు చెప్పమంటే... ఉద్యమం మొదలుపెట్టాక డబ్బులు ఇచ్చామని చెబుతున్నారని, ఎంత ఇచ్చారన్నది స్పష్టంగా చెప్పడంలేదని ఆరోపించారు. అందుకే మలి విడత ఉద్యమాన్ని చేపట్టాల్సి వస్తోందని అన్నారు. 

ఉద్యోగుల కోసమే రూ.70 వేల కోట్లను ఖర్చు చేస్తున్నామని చెబుతున్న ప్రభుత్వం... సలహాదారులు, వలంటీర్ల కోసం రూ.20 కోట్లు ఖర్చు చేస్తున్న విషయం ఎందుకు చెప్పడంలేదని నిలదీశారు. ఉద్యోగుల సమస్యల పట్ల ఇంత నిర్లక్ష్యమా అంటూ బొప్పరాజు మండిపడ్డారు. తమ డిమాండ్లను పట్టించుకోకపోతే మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. ఉద్యమాన్ని మరింత తీవ్రం చేస్తామని వెల్లడించారు.

More Telugu News