World Health Day: వారంలో ఏడు రోజులూ వీటిని చేస్తే ఆరోగ్యం..!

  • వేకువజామునే నిద్ర లేవడం వల్ల ఊపిరితిత్తులకు మంచి ఆక్సిజన్
  • అల్పాహారం తప్పకుండా తీసుకోవాలి
  • అర్ధరాత్రి వరకు మెలకువగా ఉండొద్దు
  • రోజులో కనీసం 8 గంటల పాటు నిద్ర అవసరం
World Health Day Follow these tips 7 days a week for a healthier and longer life

ఎంత సంపద ఉన్నా, ఎన్ని ఆభరణాలు ఉన్నా.. ఆరోగ్యం లేనప్పుడు అసలైన ఆనందాన్ని అనుభవించలేం. అందుకే నేటి రోజుల్లో అన్నింటికంటే ఆరోగ్యానికి ప్రాధాన్యం పెరిగింది. ఆహారం, జీవన చర్యల్లో కొన్ని మార్పులు చేసుకోవడం ద్వారా వీలైనంత వరకు అనారోగ్యం బారిన పడకుండా కాపాడుకోవచ్చు. ఇదంతా ఎవరికి వారి చేతుల్లో ఉన్నదే. ప్రతి ఒక్కరూ ఆరోగ్యం కోసం రోజువారీ చేసుకోతగిన కొన్ని విధానాలను వైద్యులు సూచిస్తున్నారు.

ఉదయాన్నే నిద్ర లేవడం
ఉదయాన్నే నిద్ర లేవడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. వేకువజామున గాలిలో ఆక్సిజన్ ఎక్కువగా ఉంటుంది. సూర్యుడు పూర్తి స్థాయిలో ఉదయించే సమయానికి ఈ ఆక్సిజన్ పరిమాణం తగ్గుతుంది. కనుక వేకువ జామున సూర్యోదయానికి ముందే నిద్ర లేవడం వల్ల మనకు ఎక్కువ ఆక్సిజన్ అంది నూతన ఉత్తేజం లభిస్తుంది. రోజంతా ఉత్సాహంగా ఉండగలరు.

వ్యాయామాలు లేదా యోగా
రోజంతా మన శరీరం చురుగ్గా పనిచేసేందుకు తగినంత శక్తి అవసరం. అందుకే వేకువ జామునే నిద్ర లేచి వ్యాయామాలు చేయాలి. యోగా చేసినా సరిపోతుంది. వీటివల్ల శారీరక, మానసిక సామర్థ్యం ఇనుమడిస్తాయి. ఆరోగ్యంగా జీవించేందుకు శరీర బరువు పరిమితికి మించి ఉంకూడదన్నది ప్రాథమిక సూత్రం. వ్యాయామాలతో అధిక బరువు తగ్గించుకోవడం సులభం. 

బ్రేక్ ఫాస్ట్
ఉదయం తీసుకునే మొదటి ఆహారం పోషకాలతో ఉండాలి. చాలా మంది ఉదయం అల్పాహారం తినకుండా నేరుగా లంచ్ చేస్తుంటారు. కానీ ఆరోగ్య రీత్యా ఇది కరెక్ట్ కాదు. ఉదయాన్నే లేచి, వ్యాయామాలు చేసి, ఫ్రెషప్ అయిన తర్వాత పోషకాలతో కూడిన అల్పాహారం లేదంటే పండ్లు, గుడ్లు తీసుకోవాలి. దీనివల్ల శరీరం చురుగ్గా, శక్తిమంతంగా ఉంటుంది.

జంక్ ఫుడ్ వద్దు
బయట బండ్లపై తయారు చేసేవి, హోటళ్లలో పదార్థాలు, జంక్ ఫుడ్ తీసుకోవద్దు. ఇంట్లో చేసుకున్న ఆహారమే సురక్షితమైనది. బయటి ఆహారంతో కేన్సర్ రిస్క్ పెరుగుతోంది. బయటి ఆహారం వల్ల హెచ్ పైలోరీ బ్యాక్టీరియా మన జీర్ణ వ్యవస్థలోకి చేరి సమస్యలకు కారణమవుతుంది. అందుకే ఇంటి ఫుడ్ కే ప్రాధాన్యం ఇవ్వాలి.

రాత్రి పూట ఆలస్యంగా..
రాత్రి పూట ముందుగానే డిన్నర్ ను పూర్తి చేయాలి. రాత్రి ఆహారం తర్వాత నిద్రకు మధ్య కనీసం 2-3 గంటల విరామం ఉండాలి. అందుకని 8 గంటలకే డిన్నర్ పూర్తి చేసుకుని రూ.10-11మధ్యలో నిద్రపోవాలి. 

తగినంత నిద్ర
నిద్ర కూడా సరిపడా ఉండాలి. అర్ధరాత్రి వరకు మేల్కొని ఉండకూడదు. ఆరోగ్యం కోసం కనీసం 8 గంటల నిద్ర ఉండాలన్నది వైద్యుల సూచన.

More Telugu News