Karanataka polls: బోనీ కపూర్ కారులో 66 కిలోల వెండి వస్తువుల సీజ్

  • కర్ణాటకలోని దావణగిరె సమీపంలో కారులో గుర్తింపు
  • ఈ కారు బోనీ కపూర్ కు చెందిన బేవ్యూ ప్రాజెక్ట్స్ పేరుతో రిజిస్ట్రేషన్
  • బోనీ కపూర్ కుటుంబానికి చెందినవిగా వెల్లడించిన కారులోని వ్యక్తి
Karanataka polls Silverwares worth Rs 39 lakh belonging to film producer Boney Kapoor seized in Davangere

కర్ణాటక రాష్ట్రంలోని హెబ్బెళ్లు చెక్ పోస్ట్ వద్ద కారులో 66 కిలోల వెండి వస్తువులను ఎన్నికల కమిషన్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ.39 లక్షలుగా ఉంటుందని అంచనా. దావణగిరె పట్టణ శివార్లలో ఇది చోటు చేసుకుంది. సరైన పత్రాలు లేకుండా ఐదు బాక్సుల్లో ఈ వెండి వస్తువులను ప్యాక్ చేసి, బీఎండబ్ల్యూ కారులో చెన్నై నుంచి ముంబైకి తరలిస్తున్నట్టు గుర్తించారు. కర్ణాటక రాష్ట్రంలో ఎన్నికల సందర్భంగా ఈసీ నిఘాను విస్తృతం చేసింది. ఈ క్రమంలో ఇది వెలుగు చూసింది.

వెండి పాత్రలు, స్పూన్లు, మగ్గులు, ప్లేట్లు తదితర వస్తువులు వీటిల్లో ఉన్నాయి. ఈసీ అధికారులు వీటిని సీజ్ చేశారు. కారు డ్రైవర్ సుల్తాన్ ఖాన్ తోపాటు, కారులో ఉన్న హరి సింగ్ పై దావణగిరె పోలీసు స్టేషన్ లో కేసు నమోదైంది. పోలీసుల విచారణలో ఈ కారు బేవ్యూ ప్రాజెక్ట్స్ ప్రైవేటు లిమిటెడ్ పేరుతో రిజిస్టర్ అయి ఉన్నట్టు తెలిసింది. ఈ సంస్థ బాలీవుడ్ నిర్మాత, నటి శ్రీదేవి భర్త బోనీ కపూర్ కు చెందినది. వెండి వస్తువులు బోనీ కపూర్ కుటుంబానికి చెందినవిగా విచారణలో హరి సింగ్ ఒప్పుకున్నాడు.

More Telugu News