Congress: కర్ణాటక కాంగ్రెస్ దే: శరద్ పవార్

congress will form governament in karnataka says sharad pawar
  • కాంగ్రెస్ పార్టీకే కర్ణాటక ప్రజలు పట్టం కడతారన్న పవార్ 
  • మెజారిటీ సీట్లను గెలుచుకుంటుందని జోస్యం
  • ప్రతిపక్షాలన్నీ ఏకం కాకుంటే లోక్ సభ ఎన్నికల్లో బీజేపీని ఓడించలేమని వ్యాఖ్య
వచ్చే నెలలో ఎన్నికలు జరగనున్న కర్ణాటకలో ఓటర్లు కాంగ్రెస్ పార్టీవైపే మొగ్గుచూపుతారని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) చీఫ్ శరద్ పవార్ పేర్కొన్నారు. ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో శరద్ పవార్ మాట్లాడుతూ.. కర్ణాటకలో కాంగ్రెస్ హవా వీస్తుందని చెప్పారు. రాష్ట్రంలోని మెజారిటీ స్థానాలను కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంటుందని జోస్యం చెప్పారు. కర్ణాటకలో ఏర్పడబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని తెలిపారు. ఈ ఎన్నికలను బీజేపీ జాతీయ కోణంలోనే చూస్తోందని, పలు జాతీయ అంశాలను కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలతో ముడిపెట్టే ప్రయత్నం చేస్తోందని పవార్ ఆరోపించారు.

రాజస్థాన్, ఢిల్లీ, పంజాబ్, పశ్చిమ బెంగాల్, హిమాచల్ ప్రదేశ్, ఏపీ, తెలంగాణ సహా పలు రాష్ట్రాలలో బీజేపీయేతర ప్రభుత్వాలే ఉన్నాయని పవార్ గుర్తుచేశారు. త్వరలో కర్ణాటక కూడా ఈ జాబితాలో చేరుతుందని వివరించారు. రాష్ట్రాలలో బీజేపీయేతర పార్టీలన్నీ కలిసి ఉమ్మడి ప్రణాళికతో ముందుకెళితే తప్ప వచ్చే ఏడాది జరగబోయే లోక్ సభ ఎన్నికల్లో బీజేపీని మట్టికరిపించలేమని పవార్ అభిప్రాయపడ్డారు. ప్రతిపక్షాలను కూడగట్టే ప్రయత్నం చేయాల్సిన అవసరం ప్రస్తుతం ఎంతైనా ఉందని శరద్ పవార్ పేర్కొన్నారు.
Congress
Karnataka
Sharad Pawar
ncp
Karnataka polls

More Telugu News