Delhi: ఢిల్లీ రోడ్లపై ఇక డీజిల్, పెట్రోల్ టాక్సీలను అనుమతించరట.. ఎప్పటి నుంచంటే..!

  • ఎలక్ట్రిక్ వాహనాలకు మారాలంటున్న ప్రభుత్వం
  • 2030 ఏప్రిల్ తర్వాత ఒక్క టాక్సీ కూడా తిరగకూడదని టార్గెట్
  • ఈ కామర్స్ సంస్థల వాహనాలకూ ఇదే నిబంధన
  • కొత్త పాలసీని తీసుకొచ్చే ప్రయత్నంలో కేజ్రీవాల్ సర్కారు
End of Petrol Diesel Cabs Delhi Govt Sets Deadline for All Electric Shift

దేశ రాజధాని ఢిల్లీలో డీజిల్, పెట్రోల్ వాహనాల వాడకాన్ని నియంత్రించేందుకు కేజ్రీవాల్ సర్కారు కొత్త రూల్ తీసుకురానుంది. టాక్సీలు, ఈ కామర్స్ సంస్థలు తప్పనిసరిగా ఎలక్ట్రిక్ వాహనాలనే సమకూర్చుకోవాలని సూచిస్తోంది. 2030 ఏప్రిల్ నాటికి ఈ మార్పు పూర్తవ్వాలని, ఆ తర్వాత ఢిల్లీ రోడ్లపైకి డీజిల్, పెట్రోల్ టాక్సీలను కానీ ఈ కామర్స్ సంస్థల వాహనాలు (బైక్, వ్యాన్ తదితర) అనుమతించబోమని చెబుతోంది. ఇందుకోసం ప్రత్యేకంగా ఓ పాలసీ తీసుకొస్తోంది. ప్రస్తుతం దీనికి ఢిల్లీ కేబినెట్ ఆమోదం లభించిందని, రవాణా శాఖ అనుమతితో పాటు లెఫ్టినెంట్ గవర్నర్ ఆమోదం కోసం ఎదురుచూస్తున్నట్లు రవాణా శాఖ మంత్రి కైలాశ్ గెహ్లాట్ తెలిపారు.

ఢిల్లీలో కాలుష్య నియంత్రణ చర్యల్లో భాగంగా ఈ పాలసీని తీసుకొస్తున్నట్లు మంత్రి కైలాశ్ గెహ్లాట్ చెప్పారు. ఇందులో భాగంగా డీజిల్, పెట్రోల్ వాహనాలను దశలవారీగా తగ్గిస్తూ, ఎలక్ట్రిక్ వాహనాల వాడకాన్ని ప్రోత్సహించనున్నట్లు వివరించారు. ఎలక్ట్రిక్ వాహనాల కోసం ఢిల్లీలో చార్జింగ్ పాయింట్ల సంఖ్యను పెంచుతున్నట్లు పేర్కొన్నారు. ఫుడ్ డెలివరీ, ఈ కామర్స్ సంస్థలు తమ సిబ్బందికి తప్పనిసరిగా ఎలక్ట్రిక్ వాహనాలనే అందించాలని మంత్రి చెప్పారు. కాగా, ఎలక్ట్రిక్ వాహనాల వాడకంలో దేశంలోనే ఢిల్లీ ముందుందని మంత్రి కైలాశ్ గెహ్లాట్ తెలిపారు.

More Telugu News