Doctors: ఏడాదికోసారి ఈ పరీక్షలతో ఎంతో ఉపయోగం!

  • 20 ఏళ్ల నుంచే స్క్రీనింగ్ మంచిది
  • వయసు పెరుగుతున్న కొద్దీ అదనపు పరీక్షలు అవసరం
  • నేడు పెరిగిపోయిన కేన్సర్, జీవనశైలి వ్యాధుల ముప్పు
  • ముందస్తు వైద్య పరీక్షలతో వీటిని గుర్తించడం సులభం
Doctors explain important medical tests you should get in your 20s 30s and 40s

నివారణే చికిత్స కంటే మెరుగైనదని నిపుణులు చెబుతుంటారు. అనారోగ్యం వచ్చిన తర్వాత తగ్గించుకోవడానికి అవస్థలు పడడం కంటే, రాకుండా జాగ్రత్తలు తీసుకోవడం సులభం కదా అనేది ఈ సూచనలోని అర్థం. ముందుగానే సమస్యలను గుర్తించినట్టయితే, ఆరంభంలోనే వాటిని కట్టడి చేసుకోవచ్చు. ప్రాణాంతక సమస్యలను ముందుగా గుర్తించడం వల్ల వాటి నుంచి బయట పడొచ్చు. జీవిత కాలాన్ని పెంచుకోవచ్చు. 

మన రోగ నిరోధక వ్యవస్థకు వ్యాధులను నయం చేసే శక్తి సహజంగా ఉంటుంది. కానీ, అన్నింటినీ రోగ నిరోధక వ్యవస్థ నయం చేయలేదు. జీవనశైలి వ్యాధులకు ఔషధాలతో పాటు ఇతర మార్పులు కూడా అవసరం అవుతాయి. ఏటా ముందస్తుగా నిర్వహించే వైద్య పరీక్షల ఆధారంగా తగిన చర్యలు తీసుకోవడానికి వీలుంటుంది. తద్వారా ఆరోగ్యాన్ని మెరుగ్గా చూసుకోవచ్చన్నది వైద్య నిపుణుల సూచన.

20 ఏళ్ల తర్వాత..
కొలెస్ట్రాల్, రక్తపోటు అనేవి ఈ వయసులో చేయించుకో తగిన పరీక్షలు. నేటి కాలంలో కొందరిని 20 ఏళ్లకే మధుమేహం కూడా పలకరిస్తోంది. కనుక బ్లడ్ షుగర్ టెస్ట్ కూడా చేయించుకోవచ్చు. లైంగిక సంబంధాల విషయంలో చురుగ్గా ఉండేవారు ఎస్టీడీ టెస్ట్ చేయించుకోవాలి. కంప్లీట్ బ్లడ్ కౌంట్ టెస్ట్ తో మహిళల్లో రక్త హీనతను గుర్తించొచ్చు. మహిళల్లో నెలసరి రుతుస్రావం వల్ల హిమోగ్లోబిన్ తక్కువగా ఉంటుంది. తగిన పోషకాహారం తీసుకోకపోవడం కూడా దీనికి ఒక కారణం. అందుకని హిమోగ్లోబిన్ తో పాటు, రోగ నిరోధక వ్యవస్థ ఎలా ఉందో తెలియజేసే వైట్ బ్లడ్ సెల్స్ కౌంట్ ఎలా ఉన్నదీ కంప్లీట్ బ్లడ్ కౌంట్ పరీక్ష ద్వారా తెలుసుకోవచ్చు. 

అలాగే, ఐరన్ తోపాటు, శరీరంలో ఐరన్ స్టోరేజ్ ను తెలియజేసే సిరమ్ ఫెర్రెటిన్ టెస్ట్ మహిళలు చేయించుకోవాల్సిన ముఖ్యమైన పరీక్షలు. ఇంకా విటమిన్ డీ, బీ12 కూడా ముఖ్యమైనవి. ఎముకలు, నరాల పనితీరుకు విటమిన్ బీ 12 ఎంతో అవసరం. ఇక ఇటీవలి కాలంలో మహిళల్లో థైరాయిడ్ సమస్యలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కనుక థైరాయిడ్ (టీఎస్ హెచ్) టెస్ట్ కూడా చేయించుకోవచ్చు.

30 ఏళ్ల తర్వాత
పైన చెప్పిన పరీక్షలతోపాటు, ఫాస్టింగ్ బ్లడ్ షుగర్, పోస్ట్ లంచ్, హెచ్ బీఏ 1సీ టెస్ట్ చేయించుకోవడం ద్వారా మధుమేహం గురించి వివరంగా తెలుసుకోవచ్చు. మహిళలు అయితే బ్రెస్ట్ అల్ట్రా సౌండ్ పరీక్ష చేయించుకోవాలి. ప్రతి మూడేళ్లకోసారి 40 ఏళ్లు వచ్చే వరకు చేయించుకోవాలి. దీనివల్ల వక్షోజాల్లో కణితులు ఉంటే తెలుసుకోవచ్చు. ఇంకా కంటికి సంబంధించి పరీక్షలు కూడా అవసరమే. సర్వైకల్ కేన్సర్ కు సంబంధించి పాప్ స్మియర్ పరీక్ష కూడా మహిళలు చేయించుకోవాలి. కుటుంబంలో కేన్సర్ చరిత్ర ఉన్నవారు తప్పకుండా వీటిని చేయించుకోవాలి.

40 ఏళ్ల తర్వాత
ముందు చెప్పుకున్న పరీక్షలకు అదనంగా 40 ఏళ్లు నిండిన వారు కిడ్నీ ఫంక్షన్ టెస్ట్ (కేఎఫ్ టీ), లివర్ ఫంక్షన్ టెస్ట్ (ఎల్ఎఫ్ టీ), ఈసీజీ, 2డీ ఎకో, ఛాతీ ఎక్స్ రే, కంప్లీట్ యూరిన్ ఎగ్జామినేషన్ పరీక్షలు చేయించుకోవాలి. స్టూల్ ఒకల్ట్ బ్లడ్ టెస్ట్ ద్వారా కొలన్ కేన్సర్ ను గుర్తించొచ్చు. ప్రొస్టేట్ స్పెసిఫిక్ యాంటీజెన్ టెస్ట్ ద్వారా ప్రొస్టేట్ కేన్సర్ ను గుర్తించొచ్చు. 40 ఏళ్లు దాటిన మహిళలు వక్షోజాల కేన్సర్ ను గుర్తించేందుకు మమ్మోగ్రామ్ పరీక్ష చేయించుకోవాలి. కొలనోస్కోపీ, చెస్ట్ సీటీ స్కాన్, అబ్డామిన్ సీటీ స్కాన్ చేయించుకోవాలి. ఓవరీలు, పాంక్రియాస్, ఇంటెస్టిన్, లంగ్ కేన్సర్ కు సంబంధించి మూడేళ్లకోసారి పరీక్షలు అవసరమవుతాయి. వ్యక్తుల కుటుంబ వైద్య చరిత్ర, వారి ప్రస్తుత ఆరోగ్యం తదితర అంశాల ఆధారంగా వైద్యులు వీటిల్లో అవసరమైనవి సూచిస్తారు.

More Telugu News