sunrisers hyderabad: ఆ ముగ్గురి రాకతోనైనా సన్ రైజర్స్ రాత మారుతుందా?

  • నేడు లక్నోతో సన్ రైజర్స్ పోరు
  • అందుబాటులోకి కెప్టెన్ మార్ క్రమ్, క్లాసెన్, జాన్సెన్
  • తొలి మ్యాచ్ లో రాజస్థాన్ చేతిలో చిత్తయిన హైదరాబాద్
SRH take on LSG today

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023 సీజన్ ను ఘోర ఓటమితో ఆరంభించిన సన్ రైజర్స్ హైదరాబాద్ కీలక మ్యాచ్ కు సిద్ధమైంది. ఈ రోజు రాత్రి లక్నోలో జరిగే తమ రెండో మ్యాచ్ లో ఆతిథ్య లక్నో సూపర్ జెయింట్స్ తో కీలక మ్యాచ్ ఆడనుంది. ఉప్పల్ మైదానంలో రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ ఏకంగా 72 పరుగుల తేడాతో ఓడింది. బౌలింగ్, బ్యాటింగ్, ఫీల్డింగ్ అన్నింటిలో నిరాశ పరిచింది. ఆ పోరులో రెగ్యులర్ కెప్టెన్ ఐడెన్ మార్ క్రమ్ తో పాటు దక్షిణాఫ్రికాకు చెందిన మరో ఇద్దరు ప్లేయర్లు హెన్రిచ్ క్లాసెన్, మార్కో జాన్సెన్ లేకపోవడం సన్ రైజర్స్ ను దెబ్బకొట్టింది. 

అయితే, నెదర్లాండ్స్ తో వన్డే సిరీస్ ముగించుకొని భారత్ లో అడుగు పెట్టిన ఈ ముగ్గురు సన్ రైజర్స్ జట్టులో కలిశారు. వీరి రాకతో అయినా సన్ రైజర్స్ రాత మారుతుందని అభిమానులు ఆవిస్తున్నారు. కాగా, దక్షిణాఫ్రికా త్రయం అందుబాటులోకి రావడంతో లక్నోతో మ్యాచ్ లో సన్ రైజర్స్ తుది జట్టులో మార్పులు జరగనున్నాయి. నిబంధనల ప్రకారం తుది జట్టులో నలుగురు విదేశీ ఆటగాళ్లే ఉండాలి. తొలి పోరులో హ్యారీ బ్రూక్, గ్లెన్ ఫిలిప్స్, ఆదిల్ రషీద్, ఫారుఖీ ఆడారు. ఫారుఖీ, గ్లెన్ ఫిలిప్స్ స్థానంలో మార్ క్రమ్, క్లాసెన్ జట్టులోకి రావొచ్చు. వికెట్ కీపర్ గా గ్లెన్ ఫిలిప్స్ స్థానంలో హార్డ్ హిట్టర్ హెన్రిచ్ క్లాసెన్ వచ్చే అవకాశం ఉంది. మరోవైపు గత మ్యాచ్ లో సీఎస్కే చేతిలో ఓడిన లక్నో ఈ మ్యాచ్ లో గెలవాలని ఆశిస్తోంది.

More Telugu News