World Health Day: ఈ నొప్పులు కనిపిస్తే.. నిర్లక్ష్యం చేయొద్దు!

  • ఛాతీలో నొప్పిని తేలిగ్గా తీసుకోవద్దు
  • గుండె నొప్పి లేదా జీర్ణాశయ సమస్య కారణం కావచ్చు
  • తలనొప్పి రావడానికి కూడా ఎన్నో కారణాలు
  • సమస్య ఏదైనా వైద్యుల సూచన అవసరం
World Health Day 2023 11 everyday aches and pains you should not ignore

ఆరోగ్యమే మహాభాగ్యం.. పెద్దగా వ్యాధుల్లేని రోజుల్లోనే పెద్దలు చెప్పిన సూక్తి ఇది. కానీ, అనారోగ్య సమస్యలు ఎక్కువైపోయిన నేటి కాలంలో ప్రతి ఒక్కరికీ ఇది ఆదర్శనీయం. మన చుట్టూ ఉన్న వారిలో ఎవరో ఒకరు తరచుగా ఫలానా నొప్పి వేధిస్తుందని చెబుతుండగా వినే ఉంటారు. అది ఏ నొప్పి అయినా కానీయండి. విడవకుండా వేధిస్తుంటే తప్పకుండా ఓ సారి వైద్యులను సంప్రదించడం అవసరం. కొన్ని రకాల నొప్పులు కొన్ని పోషకాల లోపాన్ని తెలియజేస్తాయి. కొన్ని కేన్సర్, ఆటో ఇమ్యూన్ వ్యాధులకు సంకేతంగా కనిపిస్తుంటాయి. కనుక సమస్యను గుర్తించి చికిత్స తీసుకోవడం ఎంతైనా అవసరం. 

ఛాతీలో నొప్పి
ఛాతీలో నొప్పికి ఎన్నో కారణాలు ఉంటాయి. కచ్చితంగా వ్యాధి నిర్ధారణ చేసుకోవాల్సిందే. గుండెలో సమస్య కారణంగా వచ్చే నొప్పి కూడా కావచ్చు. హార్ట్ ఎటాక్ లేదా పల్మనరీ ఎంబోలిజం అయి ఉండొచ్చు.  యాసిడ్ రిఫ్లక్స్ వల్ల కూడా ఛాతీలో నొప్పి వస్తుంది. అందుకే వెంటనే సమస్యను గుర్తించి చికిత్స తీసుకోవాలి.

కీళ్ల నొప్పులు
కీళ్లలో వాపులు లేదా కీళ్ల వాతం వల్ల నొప్పులు రావచ్చు. సమస్యకు కారణం ఏంటన్నది వైద్యులు తేలుస్తారు. కనుక తప్పకుండా వైద్యులను సంప్రదించాలి. క్యాల్షియం లోపం, జాయింట్లు అరగడం వల్ల మోకాళ్లలో నొప్పులు రావచ్చు. దీన్ని ఆర్థరైటిస్ అంటారు. 

కండరాల నొప్పులు
విటమిన్ డీ లోపం వల్ల ప్రధానంగా కండరాల నొప్పులు వస్తుంటాయి. కానీ, విటమిన్ డీ లోపం వల్లే కండరాల నొప్పులు వస్తున్నాయా? అనేది తెలుసుకోవాలంటే రక్త పరీక్షలు చేయించుకోవాలి. వైద్యుల సూచన లేకుండా విటమిన్ డీ తీసుకోకూడదు.

తలనొప్పి, అలసట
ఎన్నో రకాల కారణాలతో తలనొప్పి కనిపిస్తుంది. తలలో ఒకవైపు వస్తుంటే అది మైగ్రేయిన్ కావచ్చు. తగినంత నిద్ర లేకపోయినా, ఒత్తిడి వల్ల కూడా తలనొప్పి వేధిస్తుంటుంది. మహిళలకు రుతు సమయంలో, మెనోపాజ్ సమయంలోనూ తలనొప్పి కనిపించొచ్చు. నరాల సంబంధిత సమస్యలతోనూ రావచ్చు. శరీరంలో నీటి పరిమాణం తగ్గిపోయినా తలనొప్పి వస్తుంది. కంటి చూపులో మార్పులు కూడా తలనొప్పికి కారణమవుతాయి. కనుక వైద్యులను సంప్రదించి కారణాన్ని గుర్తించాలి.

కడుపులో నొప్పి
జీర్ణ సంబంధిత సమస్యలు, మూత్రాశయ ఇన్ఫెక్షన్లు, కడుపులో అల్సర్, అజీర్ణం, మలబద్ధకం, ఇన్ఫెక్షన్ ఇలా ఎన్నో కారణాలతో కడుపులో నొప్పి రావచ్చు.

వెన్ను నొప్పి
ఒకటే భంగిమలో ఐదు గంటలకు పైగా కూర్చున్నప్పుడు వెన్ను నొప్పి రావడం సహజమే. కూర్చుని పనిచేసే వారికి భుజాల నొప్పులు కూడా వస్తుంటాయి. ఇందుకు సరైన పోషకాహారం, మధ్యమధ్యలో అటూ ఇటూ కదలికలు ఉండేలా చూసుకోవడం, రోజువారీ వ్యాయామాలు చేయడం అవసరం. 

కాళ్లల్లో నొప్పులు
కాలు కింది భాగంలో వాపుతో కూడిన నొప్పి వస్తుంటే అది డీప్ వీన్ త్రోంబోసిస్ అయి ఉండొచ్చు. దీనికి గల కారణాన్ని వైద్యులు గుర్తించి చికిత్స సూచిస్తారు. కండరాలపై ఒత్తిడి పెరిగినా కాళ్లల్లో నొప్పులు రావచ్చు. ఒక కాలు అంతా లాగుతూ ఉంటే అది వెన్నెముకలో డిస్క్ కంప్రెషన్ వల్ల అయి ఉండొచ్చు. అలాగే, పాదాలు తిమ్మిరెక్కి నొప్పి వేధిస్తుంటే, వైద్యులను సంప్రదించాలి.

More Telugu News