Padma awards: బీజేపీ పాలనలో అవార్డు రాదనుకున్నా.. ప్రధాని మోదీతో పద్మ అవార్డు గ్రహీత ఖాద్రీ

You Proved Me Wrong says Veteran Craft Artist To PM At Padma Awards
  • పదేళ్లుగా అవార్డు కోసం ఎదురుచూస్తున్నట్లు వెల్లడి
  • కర్ణాటక కళాకారుడు షా రషీద్ అహ్మద్ ఖాద్రీ కామెంట్స్ వైరల్
  • రాష్ట్రపతి భవన్ లో ఘనంగా అవార్డుల ప్రదానోత్సవం
  • పద్మ పురస్కార గ్రహీతలను అభినందించిన ప్రధాని  
రాష్ట్రపతి భవన్ లో పద్మశ్రీ అవార్డుల ప్రదానోత్సవం సందర్భంగా ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. పద్మ అవార్డు అందుకున్న వారిని ప్రధాని అభినందిస్తుండగా షా రషీద్ అహ్మద్ ఖాద్రీ మోదీతో మాట్లాడిన మాటలు అందరినీ ఆకర్షిస్తున్నాయి. బీజేపీ పాలనలో తనకు అవార్డు వస్తుందని ఊహించలేదన్న ఖాద్రీకి ప్రధాని చిరునవ్వుతో సమాధానమిచ్చారు. ఈ సన్నివేశానికి సంబంధించిన వీడియో ట్విట్టర్ లో వైరల్ గా మారింది.

అసలేం జరిగిందంటే..
బుధవారం సాయంత్రం రాష్ట్రపతి భవన్ లో పద్మ అవార్డుల ప్రదానోత్సవం జరిగింది. ఇటీవల కొంతమందికి అవార్డులు అందజేసిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మిగతా వారికి బుధవారం స్వయంగా అవార్డులు ఇచ్చారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీతో పాటు హోంమంత్రి అమిత్ షా తదితరులు హాజరయ్యారు. రాష్ట్రపతి ముర్ము చేతుల మీదుగా పురస్కారం అందుకున్న వారిని ప్రధాని మోదీ అభినందనపూర్వకంగా పలకరించారు. వరుసగా ఒక్కొక్కరితో చేతులు కలుపుతూ, నమస్కరిస్తూ సాగుతున్నారు.

ప్రధాని తన వద్దకు రాగానే ఖాద్రీ ఆయనతో మాట్లాడారు. యూపీఏ పాలనలో అవార్డు అందుకుంటానని ఆశించినట్లు తెలిపారు. అవార్డు కోసం పదేళ్లుగా ఎదురుచూస్తున్నానని, బీజేపీ అధికారంలోకి వచ్చాక పద్మ అవార్డుపై ఆశలు వదిలేసుకున్నానని ఖాద్రీ చెప్పారు. అయితే, తన అంచనా తప్పని మీరు నిరూపించారని, తనకు అవార్డు అందించినందుకు కృతజ్ఞుడనని మోదీతో చెప్పారు. దీనికి జవాబుగా చిరునవ్వుతో నమస్కరించిన మోదీ అవార్డుగ్రహీతలలో మిగతావారిని కూడా అభినందించారు.
Padma awards
Rashtapati Bhavan
president murmu
Shah Rasheed Ahmed Quadri
Narendra Modi

More Telugu News