IPL 2023: ఐపీఎల్ 2023: ఫైనల్ ఓవర్‌లో థ్రిల్లింగ్ విన్.. పంజాబ్ ఖాతాలో వరుసగా రెండో గెలుపు

  • ఐదు పరుగుల తేడాతో విజయం సాధించిన పంజాబ్
  • నాలుగు వికెట్లు తీసి రాజస్థాన్‌ను దెబ్బకొట్టిన నాథన్ ఎల్లిస్
  • 86 పరుగులతో అజేయంగా నిలిచిన శిఖర్ ధావన్
  • నేడు తలపడనున్న కోల్‌కతా-బెంగళూరు జట్లు
IPL 2023 Punjab Thrilling win final Over against Rajasthan Royals

శిఖర్ ధావన్ సారథ్యంలోని పంజాబ్ కింగ్స్ జట్టు ఐపీఎల్‌లో వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. రాజస్థాన్ రాయల్స్‌తో గత రాత్రి జరిగిన మ్యాచ్‌లో 5 పరుగుల తేడాతో గెలుపొందింది. పంజాబ్ నిర్దేశించిన 198 పరుగుల విజయ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో చివరి వరకు పోరాడిన రాజస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 192 పరుగులకు మాత్రమే పరిమితమైంది.

చివర్లో షిమ్రన్ హెట్మెయిర్, ధ్రువ్ జురెల్ బ్యాట్‌తో చెలరేగినప్పటికీ జట్టుకు విజయాన్ని అందించడంలో విఫలమయ్యారు. షిమ్రన్ 18 బంతుల్లో ఫోర్, మూడు సిక్సర్లతో 36, ధ్రువ్ 15 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 32 పరుగులు చేశాడు. జట్టు విజయానికి చివరి ఓవర్లో 16 పరుగులు అవసరం కాగా హెట్మెయిర్ వికెట్‌ను కోల్పోయి 10 పరుగులు మాత్రమే చేసి ఓటమి పాలైంది. కెప్టెన్ సంజు శాంసన్ 42, దేవదత్ పడిక్కల్ 21, రియాన్ పరాగ్ 20 పరుగులు చేశారు. పంజాబ్ బౌలర్లలో ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ నాథన్ ఎల్లిస్ 4 వికెట్లు తీసి  రాజస్థాన్‌ను కోలుకోలేని దెబ్బ తీశాడు. 

అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్‌కు ఓపెనర్లు ప్రభు సిమ్రన్, కెప్టెన్ శిఖర్ ధావన్ శుభారంభం ఇచ్చారు. ఇద్దరూ కలిసి తొలి వికెట్‌కు 90 పరుగులు జోడించి గట్టి పునాది వేశారు. ప్రభుసిమ్రన్ 34 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్సర్లతో 60 పరుగులు చేయగా, ధావన్ 56 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్సర్లతో 86 పరుగులతో అజేయంగా నిలిచాడు. జితేశ్ శర్మ 27, షారూఖ్ ఖాన్ 11 పరుగులు చేశారు. రాజస్థాన్ బౌలర్లలో జాసన్ హోల్డర్ రెండు వికెట్లు పడగొట్టాడు. ఐపీఎల్‌లో నేడు కోల్‌కతా నైట్ రైడర్స్-రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్లు కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో తలపడతాయి.

More Telugu News