Harish Rao: పేపర్ లీక్ వెనక బండి సంజయ్ కుట్ర.. తెలంగాణ మంత్రి హరీశ్ రావు ఆరోపణలు

  • పదో తరగతి ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారంపై మంత్రి హరీశ్ రావు ప్రెస్ మీట్
  • పిల్లల భవిష్యత్తుతో ఆడుకుంటున్నారని మండిపడ్డ హరీశ్ రావు
  • బీజేపీ నేతలకు చదువు విలువ తెలియదంటూ విమర్శలు
Minister Harish Rao press meet on 10th paper leak

పదో తరగతి ప్రశ్నపత్రాల లీక్ వెనక బీజేపీ కుట్ర ఉందని, ఆ కుట్ర వెనక ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మాస్టర్ ప్లాన్ ఉందని తెలంగాణ మంత్రి హరీశ్ రావు ఆరోపించారు. తమ రాజకీయ స్వార్థం కోసం, బీఆర్ఎస్ పార్టీపై బురద జల్లడం కోసం విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారని మండిపడ్డారు. బీజేపీ నేతలకు చదువు విలువ తెలియదని, రాష్ట్రం నుంచి ఢిల్లీ దాకా ఆ పార్టీలో ఫేక్ సర్టిఫికెట్ల నేతలే ఎక్కువని విమర్శించారు. ఈమేరకు పదో తరగతి పరీక్షల పేపర్ లీక్ అంశంపై మంత్రి హరీశ్ రావు బుధవారం ప్రెస్ మీట్ లో మాట్లాడారు.

తాండూరు తెలుగు పేపర్, వరంగల్ లో హిందీ పేపర్ లీక్ కు పాల్పడింది బీజేపీ కార్యకర్తలేనని మంత్రి హరీశ్ రావు చెప్పారు. ఈ రెండు ఘటనలలో బండి సంజయ్ కుట్ర దాగుందని ఆరోపించారు. తాండూరులో పశ్నపత్రం వాట్సాప్ లో లీక్ చేసిన ఉపాధ్యాయుడు బీజేపీ ఉపాధ్యాయ సంఘం నేత అని మంత్రి చెప్పారు. అదేవిధంగా వరంగల్ లో హిందీ పేపర్ లీక్ చేయడానికి ప్రయత్నించిన ప్రశాంత్ కరుడుగట్టిన బీజేపీ కార్యకర్త, బండి సంజయ్ అనుంగు అనుచరుడు అని చెప్పారు. బీజేపీ నేతలతో ప్రశాంత్ దిగిన ఫొటోలను, పోస్టర్లను మంత్రి హరీశ్ రావు ఈ సందర్భంగా మీడియా ముందు ప్రదర్శించారు.

విద్యార్థుల జీవితాలతో, వారి భవిష్యత్తుతో చెలగాటమాడే హక్కు బీజేపీకి ఎవరిచ్చారని హరీశ్ రావు మండిపడ్డారు. పిల్లల భవిష్యత్తు కోసం పాటుపడేలా ప్రభుత్వాలు పనిచేయాలి కానీ అధికారం కోసం వారి భవిష్యత్తును ఫణంగా పెట్టొద్దని హితవు పలికారు. పదో తరగతి ప్రశ్నపత్రాలు లీక్ అయ్యాయనే వార్తలతో ఆందోళన చెందవద్దని విద్యార్థులకు, తల్లిదండ్రులకు మంత్రి హరీశ్ రావు సూచించారు. విద్యార్థులు చదువుపై దృష్టి పెట్టాలని కోరారు.

More Telugu News