Donald Trump: డొనాల్డ్ ట్రంప్ అరెస్ట్.. అమెరికా చరిత్రలోనే తొలిసారి!

  • 2006లో ఓ హోటల్‌లో నటితో శృంగారంలో పాల్గొన్నట్టు ఆరోపణలు
  • మొత్తం 34 అభియోగాల నమోదు
  • మాజీ అధ్యక్షుడు అరెస్ట్ కావడం అమెరికా చరిత్రలోనే తొలిసారి
  • కోర్టులో లొంగిపోయిన ట్రంప్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు
  • తనకే పాపం తెలియదన్న ట్రంప్
US Farmer President Donald Trump Arrested

2016 నాటి హష్‌మనీ కేసులో అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అరెస్టయ్యారు. ఓ మాజీ అధ్యక్షుడు అరెస్ట్ కావడం అమెరికా చరిత్రలోనే ఇది తొలిసారి. హష్‌మనీ కేసులో ట్రంప్‌పై మొత్తం 34 అభియోగాలు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో నిన్న మధ్యాహ్నం స్థానిక కాలమానం ప్రకారం 2.30 గంటలకు ఆయన మన్‌హటన్ కోర్టులో లొంగిపోయారు. ఆ వెంటనే ఆయనను అధీనంలోకి తీసుకున్న పోలీసులు న్యాయమూర్తి ఎదుట హాజరు పరిచారు. 

2006లో లేక్‌తాహో హోటల్‌లో ట్రంప్ తనతో శృంగారంలో పాల్గొన్నట్టు పోర్న్ స్టార్ స్టార్మీ డేనియల్ ఇటీవల వెల్లడించి ప్రకంపనలు రేపారు. ట్రంప్, తాను ఓ కార్యక్రమంలో కలుసుకున్నామని, ఆ తర్వాత శృంగారంలో పాల్గొన్నట్టు చెప్పారు. ఆ తర్వాత 2016 అధ్యక్ష ఎన్నికలకు నెల రోజుల ముందు ఈ విషయాన్ని ఆమె బయటపెట్టకుండా ఉండేందుకు ట్రంప్ ఆమెకు పెద్దమొత్తంలో డబ్బులు ఇచ్చినట్టు ఆరోపణలున్నాయి. ఈ విషయంలో మనహటన్ కోర్టులో ట్రంప్‌పై అభియోగాలు నమోదయ్యాయి. ట్రంప్ తన అడ్వకేట్ కోహెన్ ద్వారా 1.30 లక్షల డాలర్లు డేనియల్స్‌కు ఇచ్చినట్టు ప్రాసిక్యూషన్ తన వాదనలు వినిపించింది. కోహెన్ కూడా ఈ విషయాన్ని నిర్ధారించారు. 

ఈ నేపథ్యంలో ఆయన నిన్న కోర్టులో లొంగిపోయారు. ట్రంప్‌ను సాంకేతికంగా అరెస్ట్ చేసినప్పటికీ ఆయన చేతికి బేడీలు వేయలేదని స్థానిక వార్తా సంస్థలు పేర్కొన్నాయి. ట్రంప్ కోర్టుకు హాజరు కావడానికి ముందు ఆయన అభిమానులు న్యూయార్క్, ట్రంప్ టవర్, మనహటన్ కోర్టు వద్ద ఆందోళనలు చేపట్టారు. కాగా, తనపై వచ్చిన ఆరోపణలను ట్రంప్ ఖండించారు. డేనియల్‌ను కలిసిన మాట వాస్తవమేనని, అయితే ఆమెతో తనకు లైంగిక సంబంధాలు లేవంటూ కోర్టులో తన వాదనలు వినిపించారు. ఈ విషయంలో తాను నిర్దోషినని, తనను దోషిగా ప్రకటించవద్దని కోరారు.

More Telugu News