Minerals: ఏపీలో 15 అరుదైన ఖనిజ లవణాల గుర్తింపు

  • ఏపీలో ఎన్జీఆర్ఐ పరిశోధనలు
  • అనంతపురం జిల్లాలో అరుదైన ఆవిష్కరణలు
  • రెడ్డిపల్లె, పెద్ద వడగూరు ప్రాంతాల్లో తవ్వకాలు
  • సెల్ ఫోన్లు, టీవీలు తదితర ఉపకరణాల్లో ఖనిజ లవణాల వినియోగం
Precious minerals found in AP

హైదరాబాదులోని నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్ స్టిట్యూట్ (ఎన్జీఆర్ఐ) ఆంధ్రప్రదేశ్ లో అరుదైన ఆవిష్కరణ చేపట్టింది. అనంతపురం జిల్లాలో 15 విశిష్టమైన ఖనిజ లవణాలను గుర్తించింది. ప్రజలు నిత్యం ఉపయోగించే సెల్ పోన్ల నుంచి టీవీల వరకు అనేక వస్తువుల్లో ఈ ఖనిజ లవణాలను వినియోగిస్తారని ఎన్జీఆర్ఐ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. పరిశ్రమల్లోనూ వీటి వినియోగం ఉంటుందని తెలిపారు. 

ఎన్జీఆర్ఐ శాస్త్రవేత్తలు అనంతపురం జిల్లాలోని పలుచోట్ల సయనైటిస్ వంటి సంప్రదాయేతర శిలలపై పరిశోధనలు నిర్వహించారు. ఈ సందర్భంగా లాంథనైడ్ సిరీస్ లోని పలు మూలకాలు, ఖనిజ లవణాలు బయటపడ్డాయి. 

వీటిలో అల్లనైట్, సెరియేట్, థోరైట్, కొలంబైట్, టాంటలైట్, అపటైట్, జిర్కోన్, మోనజైట్, పైరోక్లోర్ యూక్జెనైట్, ఫ్లోరైట్ తదితర ముఖ్యమైన ఖనిజ లవణాలు ఉన్నాయి. 

ఈ పరిశోధనల్లో పాలుపంచుకున్న ఎన్జీఆర్ఐ శాస్త్రవేత్త పీవీ సుందర్ రాజు మాట్లాడుతూ, రెడ్డిపల్లె, పెద్ద వడగూరు ప్రాంతాల్లో తవ్వకాలు చేపట్టామని వెల్లడించారు. ఇక్కడ జిర్కోన్ పలు రూపాల్లో లభ్యమైందని తెలిపారు. ఇక మోనజైట్ గింజల రూపంలో, పలు రంగుల్లో దర్శనమిచ్చినట్టు వివరించారు. ఇక్కడ రేడియో యాక్టివ్ మూలకాలు కూడా ఉండే అవకాశం ఉందని వెల్లడించారు. 

మరింత అధ్యయనం చేస్తే ఈ ఖనిజ లవణాల గురించి ఇంకా ఎంతో తెలుసుకోవచ్చని అన్నారు. వీటిని క్లీన్ ఎనర్జీ, ఏరోస్పేస్, రక్షణ రంగాల్లోనూ వినియోగిస్తారని సుందర్ రాజు వెల్లడించారు.

More Telugu News