స్పెయిన్ లో పేలిన వాషింగ్ మెషిన్.. వీడియో ఇదిగో!
- కొద్ది క్షణాల ముందే బయటకెళ్లడంతో వ్యక్తికి తప్పిన ముప్పు
- సోషల్ మీడియాలో వైరల్ గా మారిన వీడియో
- బట్టల్లో లైటర్ లేదా ఛార్జర్ ఉండడమే ప్రమాదానికి కారణమని తేల్చిన అధికారులు
అసలు ఏం జరిగిందంటే..
స్పెయిన్ లో ఓ వాషింగ్ మెషిన్ సెంటర్ లోని మెషిన్ ఒకటి ఉన్నట్టుండి పేలిపోయింది. వాషింగ్ జరుగుతుండగానే డోర్ తెరుచుకుంది. లోపలి నుంచి బట్టలు బయటపడుతున్న క్షణంలోనే పేలుడు జరిగింది. దీంతో ఆ సెంటర్ లో విధ్వంసం చోటుచేసుకుంది. ఎంట్రన్స్ లో అమర్చిన అద్దాలు పగిలిపోయాయి. ఆ రూమ్ మొత్తం భయానకంగా మారిపోయింది. ఈ ఘటన జరగడానికి కొద్ది క్షణాల ముందు ఓ వ్యక్తి బయటకు వెళ్లాడు.
చేతిలో బట్టల బ్యాగుతో ఆయన అలా వెళ్లాడో లేదో ఇలా పేలుడు సంభవించింది. బయటకువెళ్లడం కాస్త ఆలస్యమయ్యుంటే ఆ వ్యక్తి పరిస్థితి ఎలా ఉండేదోనని నెటిజన్లు ఆందోళన వ్యక్తం చేశారు. కాగా, వాషింగ్ మెషిన్ లో వేసిన బట్టల్లో లైటర్, ఛార్జర్ ఉంటే ఇలా ప్రమాదం జరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. వాషింగ్ మెషిన్ లో బట్టలు వేసే ముందు ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకోవాలని సూచించారు.