Pawan Kalyan: అన్ని వివరాలు సాయంత్రం చెపుతా: ఢిల్లీలో పవన్ కల్యాణ్

Pawan Kalyan busy in Delhi
  • రెండో రోజుకు చేరిన పవన్ ఢిల్లీ పర్యటన
  • ఈరోజు అమిత్ షా, నడ్డాలతో భేటీ అయ్యే అవకాశం
  • ఈ ఉదయం మురళీధరన్ తో మరోసారి సమావేశమయిన జనసేనాని

జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఢిల్లీ పర్యటన రెండో రోజుకు చేరుకుంది. నిన్న కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ తో పవన్ భేటీ అయ్యారు. పోలవరం ప్రాజెక్టుపై కేంద్ర మంత్రితో చర్చించారు. ఈ సమావేశంలో నాదెండ్ల మనోహర్ కూడా పాల్గొన్నారు. ఏపీ బీజేపీ ఇన్ఛార్జీ మురళీధరన్ తో నిన్న భేటీ అయిన పవన్... ఈ ఉదయం ఆయనను మరోసారి కలిశారు. కాసేపటి క్రితమే వీరి సమావేశం ముగిసింది. 

కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో ఈరోజు పవన్ భేటీ అయ్యే అవకాశం ఉంది. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో నడ్డా చాలా బిజీగా ఉన్నారు. ఈ సాయంత్రం నడ్డా, రాత్రి అమిత్ షాతో పవన్ భేటీ అయ్యే అవకాశం ఉంది. మరోవైపు, మురళీధరన్ తో సమావేశాన్ని ముగించుకుని బయటకు వచ్చిన పవన్ ను అమిత్ షా, నడ్డాతో భేటీ అవుతున్నారా? అని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా... ఇంకా టైముంది, సాయంత్రం అన్ని వివరాలను వెల్లడిస్తానని చెపుతూ ఆయన కారెక్కి వెళ్లిపోయారు. 

ఏదేమైనప్పటికీ పవన్ హఠాత్తుగా ఢిల్లీకి వెళ్లడం, వరుసగా బీజేపీ సీనియర్లను కలుస్తుండటం ఏపీ రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది. బీజేపీతో కలిసి జనసేన ఎన్నికలకు వెళ్లనుందా? అనే చర్చ కూడా జరుగుతోంది.

  • Loading...

More Telugu News