Jagan: సీఎం జగన్ సమీక్ష సమావేశానికి పలువురు వైసీపీ నేతల గైర్హాజరు!

CM Jagan review meeting at Tadepalli
  • తాడేపల్లిలో సీఎం జగన్ సమీక్ష
  • సమావేశానికి హాజరుకాని ధర్మాన, బుగ్గన, విడదల రజని తదితరులు
  • పలువురు ఎమ్మెల్యేలు వ్యక్తిగత కారణాలతో గైర్హాజరు
సీఎం జగన్ ఇవాళ వైసీపీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల ఇన్చార్జిలు, ప్రాంతీయ సమన్వయకర్తలతో సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు. తాడేపల్లిలో నిర్వహిస్తున్న ఈ సమావేశానికి పలువురు వైసీపీ ఎమ్మెల్యేలు గైర్హాజరయ్యారు. ధర్మాన ప్రసాదరావు, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, విడదల రజని, ఆళ్ల రామకృష్ణారెడ్డి, చింతల రామచంద్రారెడ్డి, ద్వారకానాథరెడ్డి ఈ సమావేశానికి హాజరు కాలేదు. 

ధర్మాన ప్రసాదరావు ఆసరా కార్యక్రమం చెక్కుల పంపిణీ ఉన్నందున రాలేకపోయారని ఆయన వర్గం చెబుతోంది. ఇక బుగ్గన కొవిడ్ బారినపడినట్టు సమాచారం. ఈ నెల 6న సీఎం జగన్ చిలకలూరిపేట నియోజకవర్గంలో పర్యటించనుండగా, ఆయన పర్యటన కార్యక్రమాల సమీక్షలతో విడదల రజని బిజీగా ఉన్నారు. మరికొందరు ఎమ్మెల్యేలు కూడా వ్యక్తిగత కారణాలతో ఈ సమావేశానికి దూరంగా ఉన్నారు. 

వైసీపీ అగ్రనేత సజ్జల రామకృష్ణారెడ్డి కూడా సీఎం సమీక్ష సమావేశంలో కనిపించలేదు. ఆయన పులివెందులలో ప్రెస్ అకాడమీ మాజీ చైర్మన్ శ్రీనాథరెడ్డి పెద్ద కర్మ కార్యక్రమానికి హాజరైనట్టు తెలుస్తోంది.
Jagan
Review
YSRCP
Andhra Pradesh

More Telugu News