Mumbai: బైక్ పై ఇద్దరు యువతులతో విన్యాసాలు.. అరెస్ట్ చేసిన పోలీసులు

  • బంద్ర కుర్ల కాంప్లెక్స్ పోలీసు స్టేషన్ లో కేసు నమోదు
  • నిందితుడిని గుర్తించి అరెస్ట్ చేసిన పోలీసులు
  • వైరల్ అయిన వీడియో ఆధారంగా చర్యలు
Mumbai man who performed bike stunt with 2 women arrested

రహదారిపై సాహస విన్యాసాలకు పాల్పడిన యువకుడిని ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. ఓ యువకుడు తన బైక్ పై ముందు ఒక యువతి, వెనుక ఒక యువతిని కూర్చోబెట్టుకుని.. ముందు టైర్ ని గాల్లోకి ఎత్తి వేగంగా బైక్ ను డ్రైవ్ చేస్తున్న వీడియో ఒకటి వెలుగులోకి వచ్చింది. అత్యంత ప్రమాదకరమైన ఈ విన్యాసాన్ని పోలీసులు తీవ్రంగా పరిగణించారు. సదరు వాహనదారుడిని ఫయాజ్ ఖాద్రిగా బంద్ర కుర్ల కాంప్లెక్స్ పోలీసులు గుర్తించి అరెస్ట్ చేశారు.

సామాజిక మాధ్యమాల్లోకి చేరిన వీడియో ఆధారంగా పోలీసులు స్వచ్చందంగా కేసు నమోదు చేశారు. ఈ వీడియోని 1.89 లక్షల మంది చూశారు. వీడియో వైరల్ కావడంతో ముంబై ట్రాఫిక్ పోలీసులు స్పందిస్తూ ట్వీట్ చేశారు. ‘‘బంద్ర కుర్ల కాంప్లెక్స్ పోలీసు స్టేషన్ లో కేసు నమోదైంది. విచారణ మొదలైంది. నిందితుడి గురించి సమాచారం తెలిస్తే షేర్ చేయండి’’అంటూ అంతకుముందు ట్రాఫిక్ పోలీసులు ట్విట్టర్ లో కోరారు. చట్ట ప్రకారం బహిరంగ ప్రదేశాల్లో మోటారు బైక్ పై విన్యాసాలు చేయకూడదు. అది కూడా హెల్మెట్ లేకుండా, ఒకే బైక్ పై ముగ్గురు కలసి ఈ తరహా ప్రమాదకర ఫీట్లు చేయడం వారితోపాటు, ఆ మార్గంలోని ఇతరులకూ ప్రమాదకరమే. 


More Telugu News